నిప్పులు చిమ్ముతూ నింగికి..

main 016

పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం

ఐదు ఉపగ్రహాలు కక్ష్యలోకి

ఇస్రో చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం

మన సత్తా ప్రపంచానికి తెలిసింది

ఇస్రోను అభినందించిన ప్రధాని మోడీ

శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

శ్రీహరికోట, జూన్‌ 30 (జనంసాక్షి) :

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ సోమవారం ఉదయం నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఐదు ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు సత్తా చాటింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తద్వారా అంతరిక్ష పరిశోధనల్లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. విజయవంత వాహక నౌక పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ-23 ప్రయోగం విజయవంతమైంది. శతకోటి భారతీయుల ఆశలను నిలబెడుతూ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. 49 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్‌వీ సీ-23 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్‌ నుంచి సోమవారం ఉదయం 9.52 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-23 రాకెట్‌ నాలుగు దశలను దాటుకొని 22 నిమిషాల పాటు ప్రయాణించి ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోని షార్‌లో ఆనందం వెల్లివిరిసింది. హర్షధ్వానాలతో ¬రెత్తింది. శాస్త్రవేత్తలు ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. పీఎస్‌ఎల్‌వీ సీ-23 ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, జితేంద్రప్రసాద్‌, నారాయణ తదితరులు కూడా ఉన్నారు. విజయవంతంగా ప్రయోగాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు తెలిపారు. ప్రయోగంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలందరి దగ్గరకు వెళ్లి ఆయన అభినందించారు. ఇస్రో చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ శాస్త్రవేత్తలను ప్రధానికి పరిచయం చేశారు.

కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ సీ 23 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. శనివారం ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 49 గంటలు పూర్తి కాగానే సోమవారం ఉదయం 9.52 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 22 నిమిషాల పాటు 650 కిలోవిూటర్ల ఎత్తుకు ప్రయాణించి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్‌-7 ఉపగ్రహంతో పాటు జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐ శాట్‌, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్‌ 7.1, ఎన్‌ఎల్‌ఎస్‌ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెంది ఏడు కిలోల వెలాక్సీతో పాటు ఇస్రో ప్రయోగించిన 60 కిలోల అడ్వాన్స్‌డ్‌ ఇనార్షియల్‌ నావిగేషన్‌ సిస్టం (ఏఐఎన్‌ఎస్‌)ను నిర్దేశిత లక్ష్యానికి చేర్చింది. భారత్‌ చేపట్టిన వాణిజ్య ప్రయోగాల్లో 26వ విజయం నమోదు చేసింది.

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ-23 ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో భారత్‌ మరోమారు సత్తా చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ది చెందిన దేశాలు కూడా ఉపగ్రహాలు పట్టుకొని మన వద్దకే వస్తున్నాయంటూ.. అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాన్ని కొనియాడారు. ప్రపంచానికి భారత్‌ సత్తా చాటారని శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవేత్తల కృషిని వృథా కానివ్వబోమని పరిశోధనల ఫలితాల్ని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. సార్క్‌ దేశాలకు ఉపయోగపడేలా ఓ ఉపగ్రహాన్ని తయారుచేయాలని ఇస్రోకు ప్రధాని సూచించారు. సోమవారం శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో పీఎస్‌ఎల్‌వీ సీ-23 ప్రయోగాన్ని ప్రధాని స్వయంగా వీక్షించారు. విజయవంతంగా ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. అనంతరం షార్‌ మానిటరింగ్‌ సెంటర్‌ నుంచి ఆయన ప్రసంగించారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు జీవన యానాన్ని తీసుకెళ్లిన శాస్త్రవేత్తలకు అభినందనలు అని వ్యాఖ్యానించారు. ప్రయోగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆయన స్వయంగా అభినందించారు.

‘యే దిల్‌ మాంగే మోర్‌..’

ఇస్రో సాధించిన విజయాలను గుర్తు చేసిన మోడీ.. నాకు మరింత కావాలి (యే దిల్‌ మాంగే మోర్‌) అని అన్నారు. శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూనే వారికి మార్గనిర్దేశనం చేశారు. సార్క్‌ దేశాలకు ఉపయోగపడేలా ఓ కొత్త ఉపగ్రహాన్ని రూపొందించాలని సూచించారు. ఇది సార్క్‌ దేశాలన్నింటికీ సేవలు అందించేలా ఉండాలన్నారు. సార్క్‌ దేశాలకు మనం ఈ రూపంలో ఓ బహుమతి ఇద్దామన్నారు. భారత అంతరిక్ష పరిశోధనల ఫలాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా అందాలని, ప్రధానంగా మన పొరుగు దేశాలకు అందాల్సి ఉందన్నారు. ‘విూరు (శాస్త్రవేత్తలు) సార్క్‌ శాటిలైట్‌ను రూపొందించండి. ఆ ఉపగ్రహాన్ని మన పొరుగు దేశాలకు బహుమతిగా ఇద్దాం. వసుదేవ కుటుంబకం (ప్రపంచమంతా ఒక్కటే) అని మన ఇతిహాసాలు చెప్పిన మార్గంలో భారత్‌ ప్రయాణించాలి. దీన్ని ఇస్రో ప్రతిబింబించాలి. మన పరిశోధన ఫలాలు పొరుగు దేశాలకు కూడా దక్కాలని’ అని అన్నారు. ప్రపంచానికే సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉండగల సామర్థ్యం మనకు ఉందన్నారు.

భారతీయులకు గర్వకారణం..

ఐదు విదేశీ ఉపగ్రహాలను 660 కిలోమీటర్ల ఎత్తున నిర్దేశిత కక్ష్యలోకి అనుకున్నట్లుగా, కచ్చితంగా చేర్చామన్న ప్రధాని ఈ విజయం వల్ల ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతోందని చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞానం విషయంలో మన విజయాన్ని ప్రత్యక్షంగా చూసినందుకు గర్వకారణంగా ఉందన్నారు. ప్రపంచంలోని అభివృద్ది చెందిన ఐదారు దేశాల సరసన మనం కూడా ఒకటిగా నిలిచామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల ఉపగ్రహాలను కూడా మనం నింగిలోకి పంపించామన్నారు. ఒక్క పీఎస్‌ఎల్‌వీయే 67 ఉపగ్రహాలను కక్ష్యలోకి  చేర్చించదని గుర్తు చేశారు. ఫ్రాన్స్‌, కెనడా, జర్మనీ, సింగపూర్‌ వంటి దేశాలు కూడా శాటిలైట్లు పట్టుకొని మన దగ్గరకే వస్తున్నాయని ఇది మన అంతరిక్ష సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.

తక్కువ ఖర్చుతో ప్రయోగాలు..

‘మనది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, అవరోధాలు వచ్చినా మన శాస్త్రవేత్తలు వాటిని అధిగమించారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు, వనరుల కొరత ఉన్నా, అనేక పరిమితులు ఉన్నా అనేక విజయాలను నమోదు చేశారు’ అని కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగాలు, విజయాలను మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తొలి ఉపగ్రహం ఆర్యభట్ట నుంచి నేటి వరకు జరిపిన ప్రయోగాలను ఆయన ప్రశంసించారు. నేనిక్కడ సైకిల్‌ విూద రాకెట్‌ను తీసుకెళ్తున్న ఫొటో చూశానని తెలిపిన మోడీ అలాంటి రోజు నుంచి ఈ స్థితికి వచ్చామన్నారు. అతితక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేపడుతున్న ఇస్రోపై మోడీ ప్రశంసలు కురిపించారు. హాలీవుడ్‌ సినిమా ‘గ్రావిటీ’  కంటే కూడా తక్కువ ఖర్చుతో మనం మార్స్‌ మిషన్‌ చేస్తున్నామని గుర్తు చేశారు. ఇంధన ఇంజినీరింగ్‌ విషయంలో మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి సత్తా చూపించారని కొనియాడారు. మనకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన వారసత్వం ఉందని మోడీ గుర్తు చేశారు. మన పూర్వీకులు సున్నా (0)ను కనిపెట్టకపోతే.. ఇంత దూరం వెళ్లే వాళ్లమే కాదన్నారు. భాస్కరాచార్య, ఆర్యభట్ట, విక్రమ్‌ సారాభాయి లాంటి శాస్త్రవేత్తలు మన అంతరిక్ష విజయాలకు పునాదులు వేశారన్నారు. మానవ జీవితాన్ని ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల స్థాయికి చేర్చారని కొనియాడారు.

జీవితాలను మార్చే పరిశోధనలు..

శాస్త్రవేత్తలు ల్యాబ్‌లలో కూర్చొని చేసిన పరిశోధనలకు కోట్లాది మంది జీవితాలను మార్చే శక్తి ఉందన్నారు. మీరు సాధించిన విజయాల ఫలితాలతో మేం ఎక్కడో ఉన్న అడవుల్లో కూడా నాణ్యమైన జీవనం అందించగలమని చెప్పారు. డిజిటల్‌ ఇండియా 125 కోట్ల మంది భారతీయులను ఏకం చేస్తోందన్నారు. సాంకేతిక విజయాలతో సామాన్యుడికి సంబంధం లేదన్న కొంత మంది ఆలోచనలు తప్పని మోడీ అన్నారు. 125 కోట్ల మంది భారతీయులతో అంతరిక్ష రంగం ముడిపడి ఉందన్నారు. ‘ఆ ఆలోచనను మానుకోవాలి. మన శరీరంలో ఏదైనా లోపం వస్తే తప్ప ఆ భాగం విలువ ఏమిటో మనకు తెలియదు. అంతరిక్ష శాస్త్ర ప్రాముఖ్యం కూడా ఎంత అనేది అందరికీ తెలియజేయాల్సి ఉంది. టెక్నాలజీకి సామాన్యుడితో సంబంధం ఉంది. అంతరిక్ష రంగం పేదల జీవితాల్లో కచ్చితంగా మార్పు తెస్తుంది. అత్యంత మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తుంది. లాంగ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ద్వారా, టెలి మెడిసిన్‌ ద్వారా ఎక్కడున్నా సేవలు అందుకోవచ్చు. చిన్న చిన్న పట్టణాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది’ అని అన్నారు.

జీఐఎస్‌తో లాభాలెన్నో..

పట్టణ ప్రణాళిక, వాటర్‌షెడ్‌ అభివృద్ధికి జీఐఎస్‌ ఉపయోగపడుతుందన్నారు. ల్యాండ్‌ రికార్డులను కచ్చితంగా నిర్వహించడానికీ ఉపయోగపడుతుందని చెప్పారు. నిరుపేద రైతుకు తన భూముల గురించి తెలుస్తుందన్నారు. ఎప్పుడో తోడర్‌మల్‌ తర్వాత ఇంతవరకు భూముల రికార్డులను సవిూక్షించలేదని గుర్తు చేసిన మోడీ.. ప్రతి 35 ఏల్లకు ఒకసారి భూ సవిూక్ష జరగాల్సి ఉన్నా జరగట్లేదని తెలిపారు. ఇప్పుడు విూ పరిశోధనల పుణ్యమా అని అది జరగబోతోందని శాస్త్రవేత్తలను అభినందించారు. జీఐఎస్‌ మన సహజ వనరుల నిర్వహణకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. విపత్తు నివారణ విషయంలో కూడా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. తుఫాన్‌ వంటి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు చేయడం వల్ల కోట్లాది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. మన అబివృద్ధి విధానం, ఆర్థఙక అభివృద్ధి, వనరుల పరిరక్షణ అన్నింటికీ స్పేస్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రయోగాలను విస్తరించాలి..

శాటిలైట్‌ ప్రయోగాలను మరింత విస్తరించాలని మోడీ శాస్త్రవేత్తలను కోరారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి ఎదగాలని సూచించారు. యువ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలు చాలా గర్వకారణమని మోడీ అభినందించారు. దీన్ని అన్ని యూనివర్సిటీలతో అనుసంధించాలని కోరారు. ‘నేను నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నాను. నాలుగు తరాల శాస్త్రవేత్తలను కలిశాను. ఆర్యభట్ట (భారత్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం) చూసిన వారి నుంచి ఇప్పటి వారి వరకు అందరినీ ఒకేచోట చూడడం సంతోషం. పెద్ద కుటుంబాన్ని చూసినట్లు ఉంది’ అని అన్నారు. సాధించేందుకు కొదువలేదు.. పాలనలో, అభివృద్ధిలో అంతరిక్ష రంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందాం. ఈనాటి మిషన్‌ నుంచి మనందరం స్ఫూర్తి పొందుదాం. మనం చేయగలమన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు మనమంతా గర్వంగా చెప్పుకోవచ్చు.. భారత్‌ మాతాకీ జై! అని ముగించారు.

కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌ : పీఎస్‌ఎల్‌వీ-సి23 ప్రయోగం విజయవంతం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఈ విజయం వల్ల భారతదేశం సగౌరవంగా తలెత్తుకునేలా చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం షార్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ సీ- 23 ప్రయోగం విజయవంతం కావటంపై ఆయన అభినందించారు. అంతరిక్ష ప్రయోగ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్‌ ఎదుగుతోందని వైఎస్‌ జగన్‌ అన్నారు. భారత్‌ కీర్తి కిరీటంలో పీఎస్‌ఎల్వీ సి-23 ప్రయోగం మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. కాగా ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. అంతకు ముందు ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాకెట్‌ వివిధ దశలను దాటుతూ కక్ష్యలోని విజయవంతంగా ప్రవేశించగానే శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.