కమల్‌నాథన్‌ కమిటీ కిరికిరి

9

ఆప్షన్లు ఉండాలి

నో నెవర్‌! సర్వీసు పుస్తకాలే ఆధారం

దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) :

రాష్ట్ర పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కోసం నియమించిన కమల్‌నాథన్‌ కమిటీ చివరికి కిరికిరి పెట్టింది. ఇన్నాళ్లు ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రానికే కేటాయిస్తామంటూ చెప్తూ వస్తోన్న కమిటీ మళ్లీ ఆప్షన్లను ముందుకు తెచ్చింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని గతంలోనే తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. అటెండర్‌ మొదలు ఉన్నతాధికారి వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు మాత్రమే ఇక్కడ పనిచేయాలని కోరుతున్నారు. సోమవారం సాయంత్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన కమల్‌నాథన్‌ కమిటీ ఉద్యోగుల పంపిణీపై చర్చించింది. ఈ సమావేశంలో ఆలిండియా జాయింట్‌ సెక్రటరీ అర్చనావర్మతో పాటు వైద్య, ఆరోగ్య, శాఖల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూసేందుకు స్థానికత ఆధారంగానే ఉద్యోగులను పంపిణీ చేయాలని అన్నారు. కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కేంద్రం ఆమోద ముద్ర వేయగానే నివేదికను వెబ్‌సైట్లో ఉంచి ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి దాని ఆధారంగా ఉద్యోగులను పంపిణీ చేస్తారు.

సర్వీస్‌ బుక్‌లో స్థానికత లేని వారంతా కూడా సీమాంధ్రులేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. సచివాలయంలో కమల్‌నాథన్‌ కమిటీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 60 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని వెల్లడించారు. నేటి సమావేశమే చివరి సమావేశమయేలా చూడమని కమిటీని కోరినట్లు తెలిపారు. స్థానికతను నిరూపించేందుకు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదన్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌, కమల్‌నాథన్‌ కమిటీని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. ఏప్రాంత ఉద్యోగులు, ఆప్రాంతంలోనే పనిచేసేలా నియామకాలు ఉండాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ్టి సమావేశమే చివరి సమావేశమయ్యేలా చూడాలని సీఎస్‌ రాజీవ్‌ శర్మను కోరారు. ఆగస్టు చివరి కల్లా ఉద్యోగుల విభజన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని నేతలు కమల్‌నాథన్‌ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించే విషయమై ఏర్పాటైన కమల్‌నాథన్‌ కమిటీ భేటీ అయింది. సచివాలయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కమల్‌నాథన్‌ సమావేశమై చర్చించారు.