మమ్మల్ని ఆంధ్రాకు పంపండి

5

సీమాంధ్ర ఉద్యోగుల వేడుకోలు

హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) :

తమను ఆంధ్రకే పంపాలని ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఉద్యోగల విభజనపై కమలనాథన్‌ కమిటీ భేటీకి ముందే కొందరు తమను ఆంధప్రదేశ్‌ ప్రభుత్వంలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆంధ్రాలో సీఎం చంద్రబాబు ఉద్యోగ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు పలువురు ఆంధ్రాకు పంపేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ ప్రతిపాదన ఏదీ ఇప్పటి వరకు సర్కార్‌ చేపట్టలేదు. దీనిని చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇదిలావుంటే ఇక్కడే ఉంటే 58 ఏళ్లకే రిటైర్‌ కావాల్సి వస్తుందన్న బెంగ ఉద్యోగుల్లో నెలకొంది. దీంతో ఏకంగా 812 మంది ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరుకు, వచ్చే నెలాఖరుకు పదవీ విరమణ కానున్న 812 మంది ఉద్యోగులు తమను ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ నెలాఖరులోగా పంపించేయాలని దరఖాస్తులో కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్వచ్చంధంగా ఆంధప్రదేశ్‌కు వెళ్లిపోతామని ఆ దరఖాస్తులో ఉద్యోగులు వివరించారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖల అధికారులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమర్పించారు. ఇందుకు ప్రధాన కారణం ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు స్వచ్చంధంగా ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండగా అభ్యంతరం పెట్టడంలో అర్ధం ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రాకు వెళ్లిపోతామని ధరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల్లో రాష్ట్ర కేడర్‌కు చెందిన వారుతో సహా మెరిట్‌లో 20 శాతం కోటాతో తెలంగాణలో నియామకమైన వారు కూడా ఉన్నారు. కమలనాధన్‌ కమిటీ పరిధిలోకి రాష్ట్ర కేడర్‌ పరిధిలోని ఉద్యోగులు మాత్రమే వస్తారు. మెరిట్‌ కోటాలో తెలంగాణకు వచ్చిన ఉద్యోగుల విభజన అనేది కమలనాధన్‌ కమిటీ పరిధిలోకి రాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చిన దరఖాస్తులను సోమవారం కమలనాధన్‌ కమిటీ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్వచ్చంధంగా వెళ్లిపోతానన్న రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల విషయంలో కమలనాధన్‌ కమిటీ ఎటువంటి వైఖరిని అవలంబిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే తమను రిటైర్డ్‌ కింద చూపించకుండా ఉంచాలని వీరు కోరుతున్నారు.