అవినీతిపై రాజీలేని పోరాటం

1
స్వచ్ఛమైన పాలనే సర్కారు లక్ష్యం

డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) :

అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని, స్వచ్ఛమైన పాలన అందించడమే తమ ధ్యేయమని డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అవినీతి రహిత పాలన అందిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాలన సరిఅయిన రీతిలో ఉండేందుకు వీలుగా సదుపాయాల కల్పనలో కూడా ముందుంటామని ఆయన వివరించారు. ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ఆకస్మిరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధానిలోని జిల్లా కేంద్రంపై ప్రజల ఆశలు అధికంగా ఉంటాయని ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్యోగులకు చెప్పారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు, రెవెన్యూ విభాగంలోని అత్యవసర సర్వేయర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించేందుకు వీరి అవసరం ఎంతగానో ఉందన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్ని ఒకే చోట ఉంటే పాలన సులువు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఇటీవల హైదరాబద్‌ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేని పాఠశాలలు మూసివేసిన విషయంలో స్పందిస్తూ తమ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు నిర్ణయించినందున సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు అనుమతులను త్వరితగతిన పొందేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకున్నవారందరి దరఖాస్తులను సత్వరం పరిశీలించి వెంటనే జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వాలని మహమూద్‌ అలీ సూచించారు. ఏవైనా యాజమాన్నాలకు అనుమతులు పొందడంలో ఇబ్బందులుంటే వాటిని అధిగమించేందుకు జిల్లా కలెక్టరును నేరుగా కలిసి విన్నవించుకోవచ్చునని తెలిపారు. అంతేగాని విద్యార్ధులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. విద్యాసంస్థల కోరిక మేరకు ప్రభుత్వ నిబంధనలను సరళీకరించేందుకు అలోచించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 2 వేల పై చిలుకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా అందులో 119 పాఠశాలలకు గుర్తింపు లేదని జిల్లా యంత్రాంగం గుర్తించిందని అట్టి వారంతా విద్యా హక్కు చట్టానికి లోబడి విద్యనందించేందుకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఇంకా ఏవైనా యాజమాన్యాలకుఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. కలెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం విద్యాహక్కు చట్టం అమలులోనికి వచ్చనప్పటికి తదనుగుణంగా పాఠశాలలు స్పందించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రతి పాఠశాల 25 శాతం మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించాలని, నియంత్రణకు లోబడి  ఫీజులను వసూలు చేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా వ్యవహారిస్తున్నట్లు జిల్లా యంత్రంగాం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. పాఠశాలల సమయాలను కూడా విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదని కలెక్టర్‌ అభిప్రయపడ్డారు. అనుమతి లేని పాఠశాలలకు ప్రతి యేటా నోటీసులు ఇస్తూ తగు విధంగా అవగాహన పెంచుతున్నప్పటికి స్పందించడం లేనందున తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే పాఠశాలల మూసివేతకు నిర్ణయించినట్లు వివరించారు. ఇక పై ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు నిర్వహించటానికి వీలు లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల విశ్వాసం చూరగొనేలా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సత్వరంగా నాణ్యమైనవిగా లబ్ధిదారులకందించాల్సిన బాధ్యత అధికారులదే నని స్పష్టం చేసారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ జిల్లా కలెక్టరేట్‌లోని అన్ని విభాగాలను సందర్శించి పని తీరును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు జెసి సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఆర్డీవోలు రఘురాం శర్మ, నిఖిలతో పాటు రెవెన్యూ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.