నీళ్లు వదిలాం.. చేరకపోతే బాధ్యులెవరు?

3

పాండ్యా నిర్ణయం ఏకపక్షం

సర్కారును సంప్రదించకుండా ఆదేశాలు వద్దు

డెల్టాకు నీళ్లు వదలాలా వద్దా?

నేడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో నిర్ణయం : మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) :

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఇక కృష్ణా డెల్టాకు నీరు వదిలేది లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తెలిపారు. కృష్ణా డెల్టాకు మళ్లీ నీటిని విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్టా బోర్డు సీమాంధ్ర అధికారుల పక్షం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ నుంచి వారం రోజుల క్రితం నీటిని విడుదల చేసింది. రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున 3.4 టీఎంసీల నీటిని విడుదల చేసింది. నిర్దేశిత నీటిని విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నాగార్జున సాగర్‌ గేట్లు మూసేసి నీటి విడుదలను నిలిపివేసింది. నీటి విడుదల నిలిపివేయగానే ఏపీ సర్కారు కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. మళ్లీ రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కోరింది. ఏపీ సర్కారు అడిగిందే తడువుగా కేంద్రం జల సంఘం రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు చైర్మన్‌ పాండ్యా ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. కనీసం తమ ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏలా ఆదేశిస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హరీశ్‌, పాండ్యాకు తేల్చిచెప్పారు. ఏపీ సర్కారు విడుదల చేసిన నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకోలేదని చెప్పడం సరికాదని అన్నారు. నీరు ఆవిరైపోవడం, ఇసుక మైనింగ్‌ కారణంగా గుంతలు ఏర్పడి నీటి ప్రవాహం తగ్గిపోవడంతో కేవలం 2.74 టీఎంసీల నీరు మాత్రమే బ్యారేజ్‌కు చేరిందని ఏపీ నీటి పారుదల అధికారులు తెలిపారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇది ఏమాత్రం సరిపోదని, పది టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ సర్కారు కోరుతోంది.