తెలంగాణ హెరిటేజ్‌ ఆస్తులు కాపాడాల్సిందే

2

మొజంజాహి మార్కెట్‌, గన్‌పార్క్‌, సిటీ కాలేజ్‌, సాలర్జంగ్‌ మ్యూజియం మా వారసత్వ సంపద

సొరంగ మార్గంలోనే మెట్రో రైలు

తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌

మెట్రో అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) :

తెలంగాణ చారిత్రక వారసత్వ ఆస్తులను కాపాడాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెట్రో రైల్‌ అధికారులకు తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ చరిత్రకు చిహ్నంగా గల మొహింజాహి మార్కెట్‌, గన్‌పార్క్‌, సిటీ కాలేజ్‌, సాలర్జంగ్‌ మ్యూజియం, అసెంబ్లీ, సుల్తాన్‌ బజార్‌ తదితర చరిత్రక కట్టడాలను ధ్వంసం చేయడానికి, వాటి మీదుగా మెట్రో రైలు మార్గం వేయడానికి తాము అంగీకరించబోమని సీఎం స్పష్టం చేశారు. చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతంలో సొరంగమార్గంలోనే మెట్రో రైలు మార్గం వేయాలని సూచించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో మంగళవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో సమావేశమయ్యారు. మెట్రో రైలు మార్గాలపై సీఎం కేసీఆర్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసిన దరిమిలా ఆయనతో కలసి చర్చించారని తెలుస్తోంది. ప్రభుత్వం సూచించిన చారిత్రక ప్రదేశాల్లో మెట్రో రైల్‌ అండర్‌ గ్రౌండ్‌ నుంచి వెళ్లే విధంగా పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్‌ అధికారులకు సూచించింది. ఆ విధంగా చేస్తే తమకు భారీగా నష్టం వస్తుందని, అదనపు భారం పడుతుందని, ఆ విధంగా చేయలేమని, ముందుగా అనుకున్న ప్రకారం పనులు సాగుతాయని అన్న నేపథ్యంలో ఈరోజు ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రక సుల్తాన్‌ బజార్‌, అసెంబ్లీ ముందు కట్టడాలకు భంగం వాటిల్లకుండా అండర్‌గ్రౌండ్‌లో నిర్మించాలని సీఎం ఇప్పటికే సూచించారు. చారిత్రక కట్టడాలకు భంగం వాటిల్లే మార్గాలను అనుమతించమని కూడా స్పష్టం చేశారు. దీంతో ఎండీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.