భాజపాపై అమెరికా నిఘా
2010లో ఎన్‌ఎస్‌ఏకు కోర్టు అనుమతి
వాషింగ్టన్ పోస్టు తాజా కథనం
వాషింగ్టన్, జులై 1 (జనంసాక్షి) :
కేంద్రంలో ఏకపార్టీగా అధికారాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీపై అమెరికా గూఢచర్యానికి పాల్పడినట్టు ఓ రహస్య పత్రం వెల్లడి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ సహా ఐదు రాజకీయ పార్టీలపై నిఘా పెట్టాలంటూ 2010లో అమెరికా కోర్టు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ)కు అనుమతినిచ్చినట్టు ఆ పత్రం పేర్కొంది. లెబనాన్‌కు చెందిన అమల్, వెనిజులాకు చెందిన బొలివేరియన్ కాంటినెంటల్ కో ఆర్డినేటర్, ఈజిప్టుకు చెందిన ముస్లిం బ్రదర్ హుడ్, ఈజిప్షియన్ నేషనల్ శాల్వేషన్ ఫ్రంట్, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలతో పాటు భారత్‌కు చెందిన భారతీయ జనతా పార్టీపై ఎన్‌ఎస్‌ఏ నిఘా పెట్టేందుకు కోర్టు అనుమతిచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ కోర్టు నిఘాకు అనుమతించిన జాబితాలో 193 విదేశీ ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా కూడా ఉన్నట్టు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. విదేశాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకే ఎన్‌ఎస్‌ఏ గూఢచర్యానికి కోర్టు అనుమతించిందని ఎన్‌ఎస్‌ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ అందజేసిన పత్రాలను ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది. ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టంలోని 702 సెక్షన్ కింద ఇటువంటి గూఢచర్యానికి కోర్టు అనుమతి ఏటా పొందాల్సి ఉంటుదని ప్రభుత్వం తెలిపింది. ఎన్‌ఎస్‌ఏ నిఘా నుంచి ఏ ప్రభుత్వం తప్పించుకోలేదని, నాలుగు దేశాలు మినహా అన్ని దేశాలకు సంబంధించిన సమాచారం సేకరించే అధికారాన్ని ఎన్‌ఎస్‌ఏకు కోర్టు అందించినట్టు స్కోడెన్ బయటపెట్టిన పత్రాల ద్వారా వెల్లడైంది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాలపై మాత్రం అగ్రదేశం నిఘా పెట్టదని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, యురోపియన్ యూనియన్, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలపై కూడా ఎన్‌ఎస్‌ఏ నిఘాకు కోర్టు అనుమతించింది. భారతదేశం, బీజేపీ గురించి ప్రత్యక్షంగా మాట్లాడని ఎన్‌ఎస్‌ఏ ప్రతినిధి వనీ వైన్స్, అమెరికా అధ్యక్షుడు, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇతర విభాగాలు, శాఖలకు అవసరమైన విదేశీ సమాచారాన్ని సేకరించడానికి ఈ గూఢచర్యానికి దిగుతున్నట్లు ఆ కథనం పేర్కొంది.