మళ్లీ కరువు

1
ముందొస్తు చర్యలపై నేడు మంత్రులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ, జులై 2 (జనంసాక్షి) :

కరువు ఛాయలు తరుముకొస్తున్నాయి. దేశమంతటా సగటు వర్షపాతం కంటే అతి తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. దీంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే పనిలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కాబోతున్నారు. ధరల అదుపుతో పాటు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల మంత్రులతో భేటీ అవుతున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని చర్చిస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న విధంగానే పశ్చిమ భారతంలోనూ కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఆహారం, తాగునీరు, ప్రశుగ్రాసం సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌, పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వర్షాలు లేక అల్లాడుతున్నాయి. జులై 6 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ పశ్చిమ భారతావనిలో వానలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వాయువ్య రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో రిజర్వాయర్లు, కాలువలు ఉండడంతో పంట విస్తీర్ణం తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంది. అక్కడ రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా నిలువ ఉంటుంది. పశ్చిమ భారతావనిలో మాత్రం వర్షం కురవకపోతే రైతులకు తంటాలు తప్పవు. పంటకాలంలో సాధారణంగా ఇక్కడ 200.96 లక్షల హెక్టార్లలో పంట వేస్తారు. ఈసారి మాత్రం 131.52 లక్షల హెక్టార్లలో పంట వేశారు. అదీ వర్షాలు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. వాయువ్య భారతానికి, పశ్చిమ భారతానికి చాలా తేడా ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. పశ్చిమ భారతంలో కరువు పరిస్థితి నుంచి జనాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశమంతా ద్రవ్యోల్బణ ప్రభావం ఉన్నప్పటికీ, పశ్చిమ రాష్ట్రాల పరిస్థితి ఘోరంగా ఉందని వ్యవసాయమంత్రి రాథా మోహన్‌ సింగ్‌ అన్నారు. ఈ మూడు రాష్టాల్ర ప్రజల కోసం ఐదు మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల ధరలను నియంత్రించే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. నాట్లు ఆలస్యంగా వెయ్యాలని, వర్షాలు పడేంతవరకు పంటలను జాప్యం చేయాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచించాయి.