మాతో చర్చించాకే నీటి విడుదల
ఏకపక్ష నిర్ణయాలు ఒప్పుకోం
తాగునీటి పేరుతో సాగునీరు
మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జులై 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర జల వనరుల సంఘం చర్చించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తాగునీరు పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలు విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. బోర్డు సమావేశం జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం కోరింది. కృష్ణా డెల్టా పరిధిలో తాగునీటి అవసరాలకు మరో వారం రోజుల పాటు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సాగునీటి పేరుతో కృష్ణా జలాలను తరలించుకుపోతారని ముందు నుంచి వాదించిన కేసీఆర్ సర్కారు.. తాజా పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కనీస సమాచారం, సంప్రదింపులు లేకుండా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తమ అసంతృఫ్తిని వ్యక్తం చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. భవిష్యత్తులో బోర్డు సమావేశం జరపకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరో వారం రోజుల పాటు కృష్ణా జలాలు విడుదల చేయాలన్న బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. బుధవారం పలుమార్లు నీటిపారుదల శాఖ అధికారులతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని సవిూక్షించారు. అలాగే, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతోనూ చర్చించారు. కృష్ణా జలాలను తరలించుకు పోకుండా అడ్డుకొనేందుకు ఉన్న మార్గాలను అన్వేషించారు. తెలంగాణ ప్రభుత్వ అసంతృప్తిని వివరిస్తూ లేఖ రాయాలని నిర్ణయించారు. ఆ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు బోర్డుకు లేఖ రాశారు. నీటి విడుదలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. భవిష్యత్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకొనే ముందు బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కొనసాగుతోన్న నీటి విడుదల నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటుకు ముందు.. కృష్ణా డెల్టా పరిధిలో తాగునీటి కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని గవర్నర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాగునీరు పేరుతో నారుమళ్లకు నీటిని మళ్లిస్తారని పేర్కొంది. దీంతో నీటి విడుదలకు ఆటంకం ఏర్పడింది. దీనిపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే, వారం రోజుల పాటు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు జూన్ 25 నుంచి రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేశారు. అయితే, పులిచింతలలో నీటి నిల్వలేక సాగర్ నుంచి వదిలిన నీరు ఎక్కువ భాగం అక్కడే ఉండిపోవడం, ప్రకాశం బ్యారేజీకి కేవలం 0.5 టీఎంసీల నీరు మాత్రమే చేరడంతో మరో వారం రోజులు నీటిని విడుదల చేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం నుంచి మళ్లీ నీటి విడుదల ప్రారంభమైంది.
డెల్టాకు నీరు చేరలేదని తప్పుడు నివేదిక ఇచ్చారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆంధ్రా ప్రభుత్వం తాగునీరు ముసుగులో సాగునీరును తీసుకెళ్తుందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు చేరలేదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు. పులిచింతల జలాశయం వల్ల నీరు ఆలస్యంగా చేరుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు 3 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులిచింతల జలాశయం వల్ల నీరు ఆలస్యంగా చేరుతుందన్న ఆయన, తాగునీరు ముసుగులో సాగునీరు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలకు 3 టీఎంసీల నీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాగునీటి కోసం తాము ఏనాడు అడ్డంకులు చెప్పలేదన్నారు.