కొత్త భూ సేకరణ విధానం

3

జీవోఎం ఏర్పాటు.. చైర్మన్‌గా మహమూద్‌ అలీ

హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రభుత్వం కొత్త భూ సేకరణ విధానం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. డెప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ నేతృత్వంలో ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉప సంఘంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌, జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణకు సంబంధించిన నియమ నిబంధనలు, భూసేకరణ యంత్రాంగాన్ని వీరి నేతృత్వంలోని ఉప సంఘం ఖరారు చేస్తుంది. జీవోఎం కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ కమిషనర్‌ ఆహ్వానితులుగా ఉంటారు. సీసీఎల్‌ఏ స్పెషల్‌ కమిషనర్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌, రిజిస్ట్రేషన్‌ ఐజీ, న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి, నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ నుంచి రేష్మా నాయక్‌, పునరావస కమిషనర్‌ జీవోఎంకు సహకరిస్తారు. దీనిపై ముఖ్యమంత్రి బుధవారం మంత్రులతో సమీక్షించారు. అలాగే  సర్పంచ్‌ల నుంచి ఐఏఎస్‌ ¬దా ఉండే ఉద్యోగులందరికి మర్రి చెన్నారెడ్డి మావనవనరుల విభాగంలోనే శిక్షణ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు విభాగం కార్యాలయాన్ని కేసీఆర్‌ సందర్శించడమే కాకుండా పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసేకరణ కోసం ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఎంసీహెచ్‌ఆర్‌డీ కార్యక్రమాలపై అధికారులతో సీఎం చర్చించారు. సర్పంచుల నుంచి ఐఏఎస్‌ల వరకు ఇక్కడే శిక్షణ ఇవ్వాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కార్పోరేట్‌ సంస్థలు తమ సిబ్బంది శిక్షణకు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.