అన్యాక్రాంతమైన ఈఎన్‌టీ భూములు వెనక్కు…

రెవెన్యూ శాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశం

 

హైదరాబాద్, జులై 5 : తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమై నిర్ణయం తీసుకుంది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి భూములను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం రెవన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఏయే ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆబిడ్స్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రికి సంబంధించిన 3,300 గజాల భూమిని ముగ్గురు వ్యక్తులకు నవీన్‌మిట్టల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో రెగ్యులరైజ్ చేసినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అధికారం లేనందున ఆ భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ భూములు మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ అనుచరులకు రెగ్యులరైజ్ చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లిన్నట్లు సమాచారం.