పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించడం రాజ్యాంగవిరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపారు. బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఎంపీలకు మద్దతుగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఆర్డినెన్స్ ఆమోదంతో ఖమ్మంలోని ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, పీలేరుపాడు, వీఆర్‌పురంలోని 211 గ్రామాలు ఆంధ్రాలో విలీనమవనున్నాయి. దీంతో 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆంధ్రాలో కలవనుంది. బిల్లు ఆమోదంతో భద్రాచలం పట్టణం మినహా మిగతా ప్రాంతాలు ఏపీలో విలీనం కానున్నాయి. 34 వేల కుటుంబాల్లోని 1,67,796 మంది గిరిజనులు ముంపునకు బలవనున్నారు. దీంతోపాటు కుట్రపూరితమైన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.