8 మిలియన్ల ప్రజలపై నేపాల్‌ భూకంప ప్రభావం: ఐరాస

హైదరాబాద్‌: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప ప్రభావం దాదాపు 8 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సుమారు 1.4 మిలియన్ల మంది నీరు, ఆహారం, బట్టలు, నివాసం కోసం అలమటించిపోతున్నారని యూఎన్‌ నివేదికలో వెల్లడించింది. భయానక భూకంపం సంభవించి మూడు రోజులు గడచిన తర్వాత కూడా సహాయక సిబ్బంది భూకంపం అత్యధిక తీవ్రతతో కుదిపేసిన లామ్‌జంగ్‌ తదితర ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరుకోలేకపోతున్నారని నివేదికలో వివరించారు. నేపాల్‌లో చాలా ప్రాంతాలు నేలమట్టమవడంతో సహాయకచర్యలు పెద్ద స్థాయిలో చేపట్టాల్సి ఉంది. కాఠ్‌మాండూ లోయ సహా అన్ని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని నేపాల్‌ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రిజల్‌ తెలిపారు. వైద్య సామాగ్రి, వైద్యుల సహాయం తమకిప్పుడు ఎంతగానో అవసరమన్నారు.