8 వరకు కంది కొనుగోళ్లు
దళారులను ఆశ్రయించొద్దన్న అధికారులు
కామారెడ్డి,మార్చి5(జనంసాక్షి): ఈ నెల 8వ తేదీ వరకు కంది కొనుగోళ్లు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.5,675 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. మధ్యదళారుల వద్దకు పోకుండా రైతులకు మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 304 మంది రైతులకు అధికారులు నేరుగా ఖాతాల్లో డబ్బులు చెల్లించారు. కంది రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో కంది కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఈ కేంద్రాల నుంచి 1,934 మంది రైతుల నుంచి అధికారులు కంది పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి కంది కొనుగోళ్లు సేకరిస్తున్నారు. జిల్లాలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, గాంధారి, కామారెడ్డి, తాడ్వాయి, పిట్లం మండలాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 38 వేల 700 క్వింటాళ్లను కొనుగోలు చేసేందుకు జిల్లా మర్క్‌ఫెడ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 23 వేల 863 క్వింటాళ్లను కొనుగోలు చేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో రైతుల నుంచి 13 కోట్ల 54 లక్షల 19 వేల 688 కొనుగోలు చేయగా, రూ.2 కోట్ల 11 వేల 400 రైతులకు చెల్లించారు. కంది కొనుగోళ్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రైతులు దళారీలను ఆశ్రయించవద్దని సూచించారు.