జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ: బత్తిని హరినాథ్‌గౌడ్
హైదరాబాద్: ప్రతియేటా బత్తిని సోదరులు అందించే చేపప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్ ఎనిమిదిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్‌గౌడ్ చెప్పారు. ఉబ్బసం, అస్తమా, దగ్గు, దమ్ము వ్యాధుల నుంచి ఉపశమనం కోసం తరతరాలుగా బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా అందిస్తోంది. గత 167 సంవత్సరాలుగా తమ కుటుంబం ఈ చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తోందని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం బత్తిని హరినాథ్‌గౌడ్ మీడియాతో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున ఈ చేపమందు పంపిణీ చేస్తామని, జూన్ 8వ తేదీ సాయంత్రం ఐదున్నర నుంచి 9వ తేదీ సాయంత్రం ఐదున్నర వరకు ప్రసాదాన్ని ఇస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ చేయాలని తాము భావిస్తున్నామని, కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. చేప ప్రసాదం పంపిణీకి 300 మంది వాలంటీర్లు తమ సేవలను అందిస్తారని తెలిపారు.