వరకట్న చట్టానికి తూట్లు

hj7xf4t8
తప్పుడు ఫిర్యాదులిస్తే జైలుకే…
సవరణలపై కేంద్రం యోచన

న్యూఢిల్లీ (జనంసాక్షి): వరకట్న నిరోధక చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. భర్తతోపాటు అత్తింటి వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి శిక్ష విధించేందుకు చట్టం నిబంధనల్లో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. వరకట్నానికి విస్తృత స్థాయి నిర్వచనం కలిగించడం ద్వారా వరకట్న నిరోధక చట్టానికి మెరుగులు దిద్దాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సైతం భావిస్తోంది.

”ఇటీవలి కాలంలో వరకట్న నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు పెరిగి పోతున్నాయని మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది, మహిళలు వివిధ కారణాల రీత్యా తమ భర్తలు, అత్తామామలపై ‘కట్న వేధింపు’లకు పాల్పడుతున్నారని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు” అని తమ దృష్టికి వచ్చిందని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

”ఒకవేళ సదరు ఫిర్యాదు దారు చేసిన ఆరోపణలు తప్పుల తడక అని రుజువైతే, ఆ కేసులు మూసివేయాలి. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారు పెనాల్టీ విధించడం గానీ, శిక్ష అనుభవించేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తామని” ఆ అధికారి తెలిపారు. వరకట్న వేధింపులకు పాల్పడినట్లు ఐపిసి 498ఎ సెక్షన్‌ కింద కేసు నమోదైన వెంటనే ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని అరెస్ట్‌ చేయరాదని ఈ నెలారంభంలో సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 41వ సెక్షన్‌ ప్రకారం ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిపై నమోదైన ఫిర్యాదు సబబేనని దర్యాప్తు అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే నిందితులను అరెస్ట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగం కావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, తమ భర్త, అత్తామామలపై ఉన్న అసంతృప్తి, కక్ష తీర్చుకునేందుకు వరకట్న నిరోధక చట్టాన్ని ఆసరాగా చేసుకుని వారిని వేధింపులకు గురి చేయడం పెరిగి పోయిందని సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది.

పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ వరకట్నం అడిగే అంశాలపై విస్తృత స్థాయి నిర్వచనం ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొంది. ఈ ప్రతిపాదిత సవరణలన్నీ గృహహింస చట్టంలో పొందు పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సమయంలో ఇచ్చే బహుమతుల జాబితాను కూడా చట్టంలో చేరుస్తారని సమాచారం. తప్పుడు ఆరోపణలు చేస్తే భారీ పెనాల్టీతోపాటు మహిళలు, ఆమె తల్లిదండ్రులకూ మూడేళ్ల జైలుశిక్ష కూడా విధించేందుకు వీలుగా సవరణలు ప్రతిపాదించాలని యోచిస్తున్నట్లు సమాచారం.