ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారు

4

అక్టోబర్‌ 10లోగా వెల్లడించండి

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సుప్రీం గడువు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) :

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారో అక్టోబర్‌ 10వ తేదీ వరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటువిషయంలో లెప్టినెంట్‌ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సమన్వయకర్త కేజ్రీవాల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌, బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్‌ రాష్ట్రపతిని కోరిన నేపథ్యంలో దానిని లెప్టినెంట్‌ గవర్నర్‌ సమీక్షించకుండా ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపిని ఆహ్వానించడం సరైన పద్ధతికాదని కేజ్రీవాల్‌ అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేస్తోందని, అందుకు సంబంధించిన సీడీని కేజ్రీవాల్‌ రాష్ట్రపతికి సమర్పించారు. గత ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలుచుకున్న బిజెపి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉందని, ఎన్నికల్లో పోటీచేయడానికి ఆ పార్టీ ఎందుకు భయపడుతోందని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తాము తిరిగి ఎన్నికలు జరపాలని కోరుతుండగా బిజెపి మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తుండడాన్ని కేజ్రీవాల్‌ తీవ్రంగా దుయ్యబట్టారు.