కాశ్మీర్‌ కకావికలం

3
సహాయం కోసం ఎదురుచూపులు

వరదల్లో చిక్కుకున్న ఆర్మీ జవాన్లు

ఆకలితో అలమటిస్తున్న బాధితులు

శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : వరదలతో కాశ్మీర్‌ అతలాకుతలం అవుతోంది. సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా సుమారు వెయ్యి మంది ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు జమ్మూకాశ్మీర్‌లోని పలు శిబిరాల్లో చిక్కుకుపోయారు. ఓ పక్క ఇతర ఆర్మీ సిబ్బంది ప్రజలను రక్షిస్తుంటే మరోపక్క వరదల్లో చిక్కుకున్న ఆర్మీ జవాన్లు ఆహారం, నీరు లేకుండా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వీరిని రక్షించేందుకు సైనికాధికారులు రంగంలోకి దిగారు. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్న శ్రీనగర్‌లో, దక్షిణ కాశ్మీర్‌లలో పలు ఆర్మీ శిబిరాలు ఉన్నాయి. భారీ వరదలు ఈ ప్రాంతాలను ముంచెత్తడంతో వారు తిండి, నీరు లేకుండా నీటి మధ్య చిక్కుకుపోయారని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. ఇదిలావుంటే జమ్మూకాశ్మీర్‌ ఇంకా జలవిలయం నుంచి తేరుకోలేదు. జమ్మూకాశ్మీర్‌లో వరదల వల్ల ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 200 పైనే ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. దాదాపు 75వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యం నిరంతరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇంకా దాదాపు 6లక్షల మంది ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు.సహాయ చర్యల్లో సైన్యం, వైమానిక దళం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి. వరద బాధితులకు విమానాల ద్వారా ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. 61విమానాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వైమానికదళం అధికారులు తెలిపారు. బాధితులను రక్షించేందుకు మెరైన్‌ కమాండోలు కూడా రంగంలోకి దిగారు. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే టెలిఫోన్ల వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. కరెంట్‌ లైన్లు దారికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వారం తర్వాత శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిని పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 50వేల మందిని రక్షించారు. మరో 6లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వరద బారిన పడి కల్లోలంగా మారిన కశ్మీరంలో సహాయక చర్యలు ముమ్మరమాయ్యయి. త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌ తర్వాత అంతటి ప్రకృతి విలయం చవిచూసిన జమ్మూకశ్మీర్‌లో సహాయ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో జనాన్ని తరలించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అయితే కశ్మీర్‌ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యం మామూలు జనానికి ఇవ్వడం లేదంటూ ఆగ్రహం చెందుతున్నారు. లక్షల మంది నిరాశ్రయులైన ప్రకృతి విలయం నుంచి జనాన్ని కాపాడేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఎన్‌.డీ.ఆర్‌.ఎఫ్‌ బృందాలు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నాయి. రాజధాని  శ్రీనగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంచడంతో సహా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎటు చూసిన జలమే కనిపిస్తూ.. జనం నిలబడేందుకు చోటు దొరకడం లేదు. వారం క్రితం వచ్చిన పర్యాటకులు కూడా స్వంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితిలో  ఆకలితో అలమటిస్తున్నారు. వారిని తొలుత తాత్కాలిక హెలిప్యాడ్‌ దగ్గరకు తీసుకొచ్చి తర్వాత విమానాశ్రయానికి తీసుకెళ్ళే ఏర్పాటు జరుగుతున్నాయి.

ముందే హెచ్చరించాం : ఒమర్‌

వరదలపై ఆరు నుంచి ఎనిమిది గంటల ముందే హెచ్చరించామని, పోలీసు వాహనాల ద్వారా.. మసీదులోనూ ప్రకటన చేశామని సిఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు.  అదృష్టవశాత్తు కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. దురదృష్టవశాత్తు చాలా మంది అక్కడే ఉండిపోయారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే పని జరుగుతోంది. పడవలు, హెలికాప్టర్ల సాయంతో జనాన్ని కాపాడే పని జరుగుతోంది. జనాన్ని తరలించలేని ప్రదేశాల్లో ఆహార పదార్థాలు జారవిడుస్తున్నాం. తాత్కాలిక శిబిరాల ఏర్పాటుకు టెంట్లు వచ్చాయని ఒమర్‌ తెలిపారు. ఇదిలావుంటే సహాయక చర్యలకోసం వెళ్లిన ఇద్దరు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిపై బాధితులు ఆగ్రహంతో దాడి చేశారు. సహాయం అందించేందుకు ఆలస్యంగా వచ్చారంటూ హెలిక్టాపర్లపై రాళ్లు రువ్వారు. దీంతో సహాయ చర్యలకు కొంత ఆటంకమేర్పడింది. స్థానికుల దాడిలో గాయపడిన ఒకరిని చండీగఢ్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారు. ప్రజలు సంయమనంతో ఉండాలని ఎలాంటి దాడులు చేయవద్దని అన్నారు. ఇలాంటి చర్యలు సైన్యం మనోస్థయిర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు.

జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం

వరదల కారణంగా జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించాల్సిన ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుత పరిస్థితి రీత్యా తమ పర్యటనను విరమించుకున్నారు. దీంతో కనీసం రెండు నెలలయినా ఆలస్యం కావచ్చని అంటున్నారు. అయితే పరిస్థితి కుదుట పడితే తప్ప ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.

ఆంధప్రదేశ్‌ సాయం రూ.5కోట్లు

జమ్మూకాశ్మీర్‌ వరదలపై ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. రూ.5కోట్లు వరదసాయం ప్రకటించింది. జమ్మూకు 300 మెట్రిక్‌ టన్నుల ఆహార పదార్థాలను పంపాలని నిర్ణయించింది. 145 మెట్రిక్‌ టన్నుల ఆహార ప్యాకెట్లను విమానం ద్వారా పంపించింది.

విజయకాంత్‌ 10 లక్షల సాయం : వరదలతో అతలాకుతలమైన జమ్మూ,కాశ్మీర్‌ను ఆదుకునేందుకు డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ 10లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా జమ్మూ, కాశ్మీర్‌ ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ప్రజల జీవితం దుర్భరంగా మారిందని విజయ్‌కాంత్‌ తెలిపారు. విజయ్‌ కాంత్‌ తన సహాయాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి అందించారు. కష్టాల్లో ఉన్న జమ్మూ,కాశ్మీర్‌ ప్రజలను ఆదుకునేందుకు సంపన్నులు, వ్యాపారవేత్తలు, యువకులు ముందుకు రావాలని ఓ ప్రకటనలో కోరారు.