ప్రతి ఇంటికి తాగునీరు

5

అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ

లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికే

రెండో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) :

రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు లక్ష్యమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలిపారు.  బుధవారం ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ‘ప్రతి ఇంటికి నల్లా, మరుగుదొడ్డి ఏర్పాటుపై అవగాహన’ కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయస్థాయికి తెలంగాణ ఖ్యాతిని తీసుకుపోతామన్నారు. తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. రెండో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్‌ అవతరించబోతుందని వివరించారు. ప్రతి ఇంటికి మంచినీరు, మరుగుదొడ్డి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణలో అధికారులపై ఒత్తిళ్లు ఉండవని, స్వేచ్ఛగా పని చేసుకోవచ్చన్నారు. తెలంగాణ అభివృద్ధి తన లక్ష్యమని.. తనకు మరో కోరికలేదని చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుపై గ్రావిూణ నీటిపారుదల శాఖ, పారిశుద్ధ్య ఇంజినీర్లతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. వేల కోట్లు వెచ్చించిన కార్యక్రమం దుర్వినియోగం కాకూడదన్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించి వాటర్‌గ్రిడ్‌ పథకం సద్వినియోగమయ్యేలా చేయాలని అధికారులను కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో సమగ్ర మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధికారుల కృషి వల్లే అది సాధ్యమైందని.. ఇప్పుడు కూడా అధికారుల సహకారం వాటర్‌గ్రిడ్‌ సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని తెలిపారు. వేల కోట్లు వెచ్చించిన కార్యక్రమాలు దుర్వినియోగం కాకూడదని అభిప్రాయపడ్డారు. డబ్బు వెచ్చించడం వరకే ప్రభుత్వం పని.. ఆ డబ్బును సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులేదనని తెలిపారు. అందరూ కలిసి సహకరించుకొని పని చేస్తేనే ప్రభుత్వ పథకాలు సద్వినియోగమవుతాయన్నారు. ‘మేం ఎంత చేసినా, చెప్పినా చేయాల్సింది విూరే. నా పనల్లా డబ్బు తెచ్చియడం.. వసతులు సమకూర్చడం, చట్టాలు మార్చాల్సి వస్తే మార్చడం. అంతే. క్షేత్రస్థాయిలో పనిచేసేది విూరు.. పథకాలు సద్వినియోగమయ్యేల చూసేది విూరేనని’ అన్నారు. అసలు పని చేసేది విూరు.. విూరందరూ సమష్టిగా కదిలితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అధికారులకు సూచించారు. ఒక్క అధికారి తప్పు చేశాడని వంద మంది అధికారులను నిందించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిరహిత పాలన ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 8,845 పంచాయతీలు, 25,084 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. అన్ని గ్రామాలకు, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని, వారి ఆశలు నెరవేర్చాల్సిన బాద్యత మనందరిపైనా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటర్‌ గ్రిడ్‌ను ఏర్పాటుచేస్తే ప్రతి ఇంటికీ మంచి నీరు అందించొచ్చని చెప్పారు. ఇప్పటివరకు తాన జీవితంలో ఫెయిల్‌ కాలేదని కేసీఆర్‌ అన్నారు. ‘తెలంగాణ కోసం నేను ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలా మంది చాలా అన్నారు. వీడి వల్ల అవుతుందా.. మొదలు పెట్టాడు, బంద్‌ చేస్తాడని వ్యతిరేకంగా మాట్లాడారు.. చివరకు ఏమైంది తెలంగాణ వచ్చింది కదా.. మనం గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు సాధ్యం కాదు’ అని అన్నారు. గుజరాత్‌లో, సింగపూర్‌లో సాధ్యమైంది తెలంగాణలో సాధ్యం కాదా? వాళ్లే సిపాయిలా.. మనం కాదా? మన శక్తిసామర్థ్యాలు వెలికితీసి రాష్ట్ర పునరనిర్మాణంలో భాగస్వాములవుదామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులకు స్వేచ్ఛ పేరుతో కాళ్లు చేతులు కట్టేశాయి. కానీ ఈ ప్రభుత్వంలో అలా ఉండదన్నారు. ఏ అధికారికి ఉండే అధికారాలు వారికి ఉంటాయి. అధికారులపై ఎవరి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎవడైనా విజయం సాధిస్తాడని ముఖ్యమంత్రి అన్నారు. సర్వే విజయవంతం అవుతుందని ఎవరైనా నమ్మిన్రా.. చివరకు సక్సెస్‌ అయిందా లేదా? బ్రహ్మండంగా సక్సెస్‌ అయిందని చెప్పారు. ప్రధానమంత్రి కూడా సర్వే గురించి అడిగిండు అని తెలిపారు. ఇలాంటిది దేశవ్యాప్తంగా చేపట్టాలని ప్రధానికి సూచించానని కేసీఆర్‌ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5కోట్లు అని అన్నారు, అదే సర్వే ద్వారా 4.5 కోట్ల జనాభా ఉన్నారని తేలిందని చెప్పారు. ‘అన్ని మంచిగా ఉన్నట్లే ఉంటాయి.. కానీ ఏదీ సక్కగా లేదు. అలాంటివన్ని తెలియడానికే సర్వే చేపట్టామని’ అన్నారు. తెలంగాణ అభివృద్దికి నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరానని కేసీఆర్‌ చెప్పారు. ప్రణాళికలతో రండి.. నిధులు కేటాయిస్తామని ప్రధాని హావిూ ఇచ్చారు. త్వరలో రాష్టాన్రికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం వద్ద పది లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. వందలాది మంది పారిశ్రామివేత్తలు తనతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఏపీ తెలంగాణకు పోటీ కాదు.. మనం గుజరాత్‌, మహారాష్ట్రతో పోటీ పడాలి.. అభివృద్ధి చెందడానికి మనకు పుష్కలంగా అవకాశాలున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల్లో కొంత నీరు నిల్వ చేసుకోవాలి.. అందులోంచి పది శాతం తాగునీటికి, పది శాతం పరిశ్రమలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడమే తన కోరిక ముఖ్యమంత్రి తెలిపారు. తనకు ఇంకేం కోరికలు లేవన్నారు. ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన. అంతకు మించింది ఇంకేవిూ లేదన్నారు. మన శక్తిసామర్థ్యాలు గుర్తించి రాష్ట్ర పునర్నిర్మాణంలో ముందుకు పోదామన్నారు.