మీకెందుకు ఉలుకు?
మా తప్పును సరిదిద్దే బాధ్యత సీఎంకు ఉంటుంది : రాజయ్య
హైదరాబాద్, సెప్టెంబరు 11 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేయడం సరికాదని ఉప ముఖ్య మంత్రి రాజయ్య అన్నారు. తన తప్పును సరిదిద్దే బాధ్యత సీఎంకు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను మందలించడం లేదా సూచించడం లాంటి చర్యలు సరైనవేనని అన్నారు. ఈ విషయంలో సానుభూతి పొందేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను రాజయ్య తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ తనకు తండ్రిలాంటి వారన్నారు. ఆయనకు తమను హెచ్చరించే అధికారం ఉందన్నారు. సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే సీఎం కేసీఆర్ నాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మేం చేసే పొరపాట్లను సరిదిద్దే బాధ్యత పార్టీ పెద్దగా, సీఎంగా ఆయనపై ఉంది. గత ప్రభుత్వాల్లా మేం తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. ప్రజా సంక్షేమం కోరి ఎన్నో సంక్షేమాలను, అభివృద్ధి పథకాలను స్వీకరించిన ప్రభుత్వ చర్యను ఏనాడు ఆహ్మానించని మందకృష్ణ మాదిగ, ఇతరులు మాపై రాజకీయ దురద్దేశ్యంతోనే విమర్శలు చేస్తున్నరని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధినేతగా తమను సరైన మార్గంలో నడవాలని సూచించిడంలో తప్పేవిూ లేదన్నారు. వరంగల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనను మందలించడంపై కొందరు రాజకీయ నేతలు, విూడియా దుష్ప్రచారం చేయడం తగదని ఉపముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. కేసీఆర్ తనకు తండ్రి లాంటివారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. తండ్రి కొడుకును మందలించినట్లుగా తనను కేసీఆర్ మందలించారని చెప్పారు. తాను తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత, అధికారం కేసీఆర్‌కు ఉందని స్పష్టంచేశారు. ఉపముఖ్యమంత్రి పదవి కేసీఆర్ తనకిచ్చిన వరమని అభివర్ణించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను కొందరు చిలవలు పలువలుగా చేస్తూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ య్య విమర్శించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సైతం తన భుజంపై తుపాకి పెట్టి కేసీఆర్‌ను కాల్చాలని చూస్తున్నారని అన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నేతలు మందకృష్ణను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే భాజపాకు మద్దతు ప్రకటించిన మందకృష్ణ ఎన్డీయే ప్రభుత్వంతో వర్గీకరణపై పార్లమెంటులో బిల్లు పెట్టించాలన్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో చాలినంత స్థలముందని, ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ప్రజల నుంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ మేరకు తాను ఆరోగ్య విశ్వవిద్యాలయం వరంగల్‌లో ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని మాత్రమే చెప్పానన్నారు. ఈ అంశాన్ని విూడియా తప్పుగా ప్రచురించడంతో ఈ సమస్య తలెత్తిందని రాజయ్య వివరించారు.