శవాలగుట్టగా కాశ్మీర్‌లోయ

55A
విషాదం మిగిల్చిన ప్రళయం

జాతీయ విపత్తుగా ప్రకటించండి

జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌అబ్దుల్లా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :

కాశ్మీర్‌లోయ శవాలగుట్టను తలపిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సంభవించిన ప్రళయం తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా శనివారం కోరారు. భయంకర వరదల కారణంగా ఊహించని రీతిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో వరద మిగిల్చిన నష్టం ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తోంది. వరదల కారణంగా శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో 14 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ జీబీ పాంట్‌ ఆస్పత్రిలో 14మంది పసిపిల్లలు వదర ప్రభావంతో మృతిచెందారని అధికారులు శనివారం వెల్లడించారు. వదర ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయి. కాశ్మీర్‌లోయలో 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరదల బీభత్సంతో రాష్ట్రంలో ఇప్పటికే 200మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరిన్ని మృతదేహాలు వెలుగు చూస్తుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, సాధారణ ప్రజలతో పాటు సైన్యం కూడా వరదలతో తీవ్రంగా నష్టపోయింది. ఊహించని వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు దెబ్బతిన్నాయి. కాశ్మీర్‌ లోయలో వరద మిగిల్చిన విషాదం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. పౌరులతో పాటు భద్రతా బలగాలకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. క్యాంపులు నీటమునిగాయి. వారి ఆయుధాలు పనికిరాకుండాపోయాయి. వందల కొద్ది ఏకే, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, గ్రేనెడ్లు నీటమునిగి పనికిరాకుండా పోయాయి. దాదాపు 26 ఏకే రైఫిళ్లు నీటిలో కొట్టుకుపోయాయని సమాచారం. శ్రీనగర్‌ ఎగువ భాగాన ఉండే గోగ్జి బాఘ్‌లో దాదాపు 400మంది సైనికులు ఉండే క్యాంపు పూర్తిగా నీటమునిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు వారు సామగ్రిని అక్కడే వదిలేసి ప్రాణాలతో బయటపడ్డారు. అన్నింటిని వదిలేసి ప్రాణాలు కాపాడుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారని ఓ సైనికుడు తెలిపాడు. ఇప్పుడు అక్కడ నీటిమట్టం తగ్గడంతో ఆయుధాల కోసం భద్రతా బలగాలు వెతుకులాట ప్రారంభించాయి. రైఫిళ్లను సర్వీసింగ్‌ చేయడం మళ్లీ ఉపయోగించవచ్చని, అయితే, గ్రేనెడ్లు, బాంబులు మాత్రం పనికి రావని అధికారులు తెలిపారు.