గ్రేటర్‌లో సత్తా చాటుదాం : దిగ్విజయ్‌సింగ్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) :
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటుదామని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. హైదరాబాద్, రంగా రడ్డి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. సోమవారం జలవిహార్‌లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపి వి.హనుమం తరావు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, డి.శ్రీనివాస్ తదిత రులు పాల్గొన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ, హైదరాబాద్ గొప్ప నగరమని, ఇక్కడ అందరు నివసించేం దుకు అధికారం ఉందని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటయ్యేంత వరకు పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంటుందని అన్నారు. విభిన్న మతాల ప్రజలు హైదరాబాద్‌లో నివసిస్తూ శాంగిసామరస్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కొన్ని సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది తప్ప మత రాజకీయాలకు పాల్పడదని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు హైదరాబాద్‌పై ఎంత అధికారం ఉందో సీమాంధ్రులకు అంతే అధికారం ఉందని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు. అయితే తెలంగాణ ఇచ్చినా కూడా హైదరాబాద్‌లో ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సమైక్యతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఎంఐఎం, బిజెపిలా మత రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడదని తెలిపారు. మత రాజకీయాలకు పాల్పడే పార్టీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, లౌకికతత్వానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇతర పార్టీల్లా మాటలు మార్చే పార్టీ కాంగ్రెస్ కాదని, జవాబుదారీతనానికి కాంగ్రెస్ పెట్టింది పేరని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పూర్వవైభవాన్ని చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంధ్రులకు భద్రత కల్పించడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ద్వారానే వచ్చిందన్న వాదనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని దిగ్విజయ్ కోరారు. ముఖ్యంగా నేతలు కూడా తమ మధ్య నెలకొన్న విభేదాలు పక్కనబెట్టి పార్టీ పటిష్టతకు కృషిచేయాలని ఆయన కోరారు. గత వంద రోజుల మోడీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చోటుచేసుకోలేదని అన్నారు. మాట తప్పడంలో టిఆర్‌ఎస్‌కు మించిన వారు ఎవరూ లేరని ఆయన పరోక్షంగా అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న కేసీఆర్ అధికారం కోసం మాట తప్పాడని దిగ్విజయ్ విమర్శించారు.
ఫలితాలను చూసి నిరుత్సాహ పడొద్దు : జైపాల్‌రెడ్డి
2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూసి పార్టీశ్రేణులు నిరుత్సాహ పడొద్దని మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హితబోధ చేశారు. గెలుపోటములు కాంగ్రెస్ పార్టీకి సహజమేనని అన్నారు. భవిష్యత్‌లో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణాకు గుండెకాయ లాంటిదని, అన్ని ప్రాంతాల ప్రజలు సుఖంగా జీవించేందుకు హైదరాబాద్ వేదికలాంటి అన్నారు. తెలుగేతరులు కూడా హైదరాబాద్‌కు తరలివస్తున్నారని, ఇకపై కూడా తరలివస్తారని ఆయన తెలిపారు. ప్రజా రక్షణకై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కాపలా కాస్తుందని, మానవతావాదాన్ని నమ్మిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్‌లా మారుస్తాననంటూ సిఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని ఆయన అన్నారు. గత పదేళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిలో కనీసం పదోవంతు చేసినా కేసీఆర్‌ను అభినందిస్తామని ఆయన అన్నారు. గతంలో సమాచార విప్లవాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీయేనని బిజెపి నేత స్వర్గీయ ప్రమోద్ మహాజన్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. గత వంద రోజుల పాలనలో ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటమి భావన నుండి కార్యకర్తలు బయటకు రావాలని, గెలుపు దిశగా ప్రయత్నించాలని, అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాని మోడీ భయపడుతున్నారని అన్నారు. గత వంద రోజుల పాలనలో విదేశీ పర్యటనలకు, సమీక్షలకే మోడీ పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. అనంతరం తెలంగాణ సిఎల్‌పి నేత జానారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2019 ఎన్నికలకు నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందని ఆయన స్పష్టంచేశారు.