సంఘ్‌పరి’వార్’
పొత్తుల కోసం ఆత్మగౌరవం తాకట్టు పెట్టం : అమిత్‌షా
ఫలించని భాజపా-శివసేన చర్చలు
ముంబై, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) :
సంఘ్ పరివార్‌తో విభేదాలు ముదురుతున్నాయి. భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య చర్చలు ఫలించలేదు. పాత మిత్రపక్షం శివసేనతో పొత్తు విషయమై బీజేపీకి ఇంతవరకు స్పష్టత రాకపోయినా.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవాన్ని బలిపెట్టి తాము పొత్తుల కోసం వెంపర్లాడబోమని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని కూలగొట్టాలంటే ‘మహాకూటమి’ బలంగా, ఐకమత్యంగా నిలవాలని ఆయన చెప్పారు. ఈ సారి మహారాష్ట్రలో వచ్చేది మాత్రం బీజేపీ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పారు. విమానంలో ముంబైనుంచి కొల్హాపూర్ వచ్చేటప్పుడు కూడా తాను బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తవాడేలకు పొత్తుల విషయాన్ని త్వరగా తేల్చాలని చెప్పానన్నారు. తాము గట్టిగా ప్రయత్నిస్తున్నా శివసేన నుంచి తగిన స్పందనలేదని వాళ్లు అన్నారని తెలిపారు. బీజేపీ రెండు అడుగులు ముందుకు వస్తుందని, శివసేన కూడా రెండు అడుగులు ముందుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు తుది అంకానికి చేరుకుందని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ ఫిఫ్టీ-ఫిఫ్టీ సీట్లు అన్న బీజేపీ నేతలు ఇప్పుడు శివసేన ఇచ్చినన్ని సీట్లు పుచ్చుకునేందుకు అంగీకరిస్తున్నారు. అమిత్ షా మహారాష్ట్ర బీజేపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ-సేనల సీట్ల సర్దుబాటుపై ఒక ప్రకటన వెలువడే అవకాశముంది. ఉప ఎన్నికల ఫలితాలు మోడీ పాలనపై రెఫరెండం కాదని బీజేపీ వాదిస్తున్నా… ఫలితాల ప్రభావం మాత్రం సీట్ల సర్దుబాటుపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. దానికితోడు … రాష్ట్రంలో సమర్థుడైన నాయకుడు కూడా లేకపోవడం బీజేపీకి శాపంగా పరిణమించింది. శివసేన కూడా సీట్ల సర్దుబాటు విషయంలో మరీ మొండిగా వ్యవహరించరాదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ బీజేపీకి 135 సీట్లు ఇవ్వడానికి, 153సీట్లను తాము ఉంచుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం సామ్నా సంపాదకీయంలో కూడా ఆ పార్టీ బీజేపీని వెనకేసుకొచ్చింది. మోడీ వేవ్ తగ్గిపోతుందన్న కాంగ్రెస్ వాదనను ఎద్దేవా చేసింది. అసెంబ్లీ ఎన్నికలు స్థానిక రాజకీయాలపై ఆధారపడి జరుగుతాయని తేల్చిచెప్పింది. సంపాదకీయంలో మోడీ పాలనపై కూడా ప్రశంసలు కురిపించారు. బీజేపీ-శివసేన-స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ తదితర పార్టీలతో కాషాయ కూటమి ఏర్పడి తీరుతుందని సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎంపీ సంజయ్ రౌత్ కుండబద్ధలు కొట్లాడు. అయితే సేన బీజేపీకన్నా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందని తేల్చిచెప్పిన సంజయ్ ముఖ్యమంత్రి మాత్రం శివసేన నుంచే ఉంటాడని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో మోడీ వేవ్ లేదన్న సంజయ్ శివసేన వేవ్ మాత్రమే ఉందన్నారు.