విడిపోని బంధం స్కాట్‌లాండ్‌

3
కలిసుండేందుకు 55 శాతం, విడిపోయేందుకు 45శాతం ప్రజల మద్దతు

ఈడెన్‌బర్గ్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) :

బ్రిటన్‌-స్కాట్లాండ్‌ బంధం వీడిపోలేదు. కలిసుండేందుకు 55శాతం, విడిపోయేం దుకు 45శాతం ప్రజల మద్దతు లభించింది. స్కాట్లాండ్‌ ప్రజాభిప్రాయ సేకరణలో ఐక్యంగా ఉండేందుకే మద్దతు లభించింది. స్కాట్లాండ్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించా లన్న విభజనవాదులకు ప్రజాభిప్రాయ సేక రణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మూడు శతాబ్దాల బ్రిటన్‌-స్కాట్లాండ్‌ బంధం మరింత దృఢంగా కొనసాగనుంది. యునై టెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి విడిపోవాలన్న ప్రతి పాదనను స్కాట్లాండ్‌ ప్రజలు తిరస్కరించారు. యూకేలోనే కొనసాగాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. సమైక్యవాదానికి అనుకూ లంగా 55 శాతం మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 45 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. రెండ్రోజుల క్రితం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం 43 లక్షల మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. స్కాట్లాండ్‌ ప్రజలు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కే మద్దతు తెలపడంతో  300 ఏళ్ల నాటి బ్రిటన్‌-స్కాట్లాండ్‌ బంధం కొనసాగనుంది. 1707 నుంచి గ్రేట్‌ బ్రిటన్‌ పాలనలో స్కాట్లాండ్‌ ఉంది. స్కాట్లాండ్‌లో మొత్తం 32 రాష్ట్రాలు ఉండగా.. 23 రాష్టాల్రు విభజనను వ్యతిరేకించాయి. కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే విభజనకు మద్దతిచ్చాయి.చారిత్రిక ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర ప్రతిపత్తి సాధించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకించారు. తాజా తీర్పు బ్రిటన్‌ పాలకులకు ఎంతో ఊరట కలిగించింది. విభజనకు మద్దతు లభించి ఉంటే బ్రిటన్‌లో రాజకీయ పరిస్థితి తారుమారయ్యేది. ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ రాజీనామా చేయాల్సి వచ్చేది. కొత్త రాజ్యంగా ఏర్పడాలన్న స్కాటిష్‌ తొలిమంత్రి అలెక్స్‌ సాల్మాండ్‌ డిమాండ్‌ను ప్రజలు వ్యతిరేకించారు. యూకే నుంచి విడిపోయేందుకు నిరాకరించారు. దీంతో సాల్మాండ్‌ ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. విభజనకు అనుకూలంగా తాము ఎలాంటి ప్రచారం చేయలేదన్నారు. అయినా, మెజార్టీ కంటే కొంచెం తక్కువ మంది ప్రజలు విభజనకు మద్దతిచ్చారని చెప్పారు. స్వతంత్రంగా ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. లండన్‌ పాలన నుంచి విముక్తి లభించాల్సి ఉందని.. అన్ని అంశాల్లో బ్రిటన్‌ జోక్యం సరికాదన్నారు. స్కాట్లాండ్‌ ప్రజల తీర్పు బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు చారిత్రక ఓటమి నుంచి బయటపడేసింది. లేదంటే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చేది. ప్రజా తీర్పుపై ప్రధాని కామెరూన్‌ హర్షం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా ఉండాలని కోరుకోవడం అభినందనీయమన్నారు. రెఫరెండం ఫలితాలు వెల్లడైన అనంతరం ఆయన జాతినుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పరస్పర సహకారంతో ముందడుగు వేయాలని అన్నారు. స్కాట్లాండ్‌ సహా వేల్స్‌, నార్తర్న్‌ ఐర్లాండ్‌ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.