భారతీయ ముస్లింలు గొప్ప దేశభక్తులు
దేశం కోసమే జీవిస్తారు.. మరణిస్తారు
ఆల్‌ఖైదా ఆటలు ఇండియాలో సాగవు
ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) : భారతీయ ముస్లింలు గొప్ప దేశభక్తులని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారు దేశం కోసం జీవిస్తారని.. దేశం కోసం మరణిస్తారని వ్యాఖ్యానించారు. దేశా నికి హాని తలపెట్టాలని వారు భావించరని అన్నారు. ఆల్‌ఖైదా ఆటలు ఇండియాలో సాగవని హెచ్చరించారు. ఉగ్రవాద సంస్థ జిహాద్ కోసం ముందుకు రావాలన్న అల్ ఖైదా పిలుపునకు భారతీయ ముస్లింలు స్పం దించబోరని ప్రధాని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ తొలిసారి సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించారు. అమెరికా తో సంబంధాల నుంచి అల్‌ఖైదా దక్షిణాసి యా విభాగం ఏర్పాటువరకు అనేక అంశాల పై ఆయన మాట్లాడారు. తాము చెప్పినట్లు నడుచుకుంటారని భావించడం విభ్రాంతేనని తెలిపారు. భారత ముస్లింలు జిహాద్ కోసం అల్‌ఖైదాలో చేరాలని ఇటీవల ఉగ్రవాద సంస్థ విడుదలచేసిన వీడియోపై మోడీ స్పందిం చారు. ‘భారతీయ ముస్లింలు దేశం కోసం జీవిస్తారు. దేశం కోసం మరణి స్తారు.. భారత్‌కు హాని తలపెట్టే చర్యలకు వారు పాల్పడరని’ వ్యాఖ్యానిం చారు. అమెరికాతో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలపై మాట్లాడుతూ.. రెండు దేశాలు అనేక ఎత్తుపల్లాలు చూశాయన్నారు. అమెరికాతో బలమైన సంబంధాలు ఏర్పడ తాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఉన్న 170మిలియన్ల ముస్లింలలో కొంత మందైనా అల్‌ఖైదా వైపు ఆకర్షితులు కాకుండా ఉంటారా? అని సీఎన్‌ఎన్ ప్రతినిధి ఫెడ్రిక్ జకారియా ప్రశ్నించగా.. ఇది మనస్తత్వానికి సంబంధించినదా.. లేక మతపరమైన అంశమా? అన్నది తాను చెప్పలేనన్నారు. మానవత్వానికి, అమానవత్వానికి మధ్య తేడాగా చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఇక్కడి ముస్లింలకు వారు అన్యాయం చేస్తున్నారు. భారత ముస్లింలు తమ అడుగులకు మడుగులొత్తుతారని వారు అనుకుంటే అది వారి భ్రమేనని పేర్కొన్నారు. 17కోట్ల మంది భారత ముస్లింలలో అల్‌ఖైదా సభ్యులు లేకపోవడమో, అతికొద్ది మంది ఉండటమో జరిగిందని గుర్తుచేస్తూ, దీనికి కారణాల గురించి ప్రశ్నించినప్పుడు.. ”ఈ అంశంపై మతపరమైన, మానసిక విశ్లేషణ చేయగలవాడిని కాదు. అయితే ప్రపంచంలో మానవత్వాన్ని పరిరక్షించాలా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మానవత్వంపై విశ్వాసం ఉన్నవారు ఐక్యంగా ఉండాలా వద్దా అన్నదే ప్రశ్న. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సంక్షోభం. ఒక దేశమో ఒక తెగకో వ్యతిరేకంగా వచ్చిన సంక్షోభం కాదు. అందువల్ల దీన్ని మనం మానవతకు, అమానవీయతకు మధ్య జరిగే పోరుగానే పరిగణించాలి” అని సమాధానమిచ్చారు. వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్న మోడీ.. ఆ దేశంతో సంబంధాలపైనా స్పందించారు. ”నిజమైన వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని భారత్, అమెరికాలు అభివృద్ధి చేసుకోగలవు. దీనిపై నాకు నమ్మకం ఉంది. రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలను పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను అమెరికా అక్కున చేర్చుకుంది. ప్రపంచంలోని ప్రతిచోటా భారతీయులు ఉన్నారు. ఇవి రెండు సమాజాల లక్షణాలను తెలియజేస్తున్నాయి” అని పేర్కొన్నారు. గత శతాబ్ద కాలంలో రెండు దేశాల సంబంధాల్లో ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయని ఆయన అంగీకరించారు. అయితే 20వ శతాబ్దపు చివర్లో, 21వ శతాబ్దపు మొదట్లో పెను మార్పులు సంభవించాయని, రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయని తెలిపారు. చరిత్ర, సంస్కృతి ఇరు దేశాలను ఒక్కటిగా చేస్తోందన్నారు. ఈ సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న నిజమైన వాంఛ వాషింగ్టన్ (అమెరికా ప్రభుత్వం)లో కనిపిం చిందా అన్న ప్రశ్నకు.. అమెరికాతో సంబంధాలను కేవలం ఢిల్లీ, వాషింగ్టన్ లకే పరిమితమన్న కోణంలో చూడరాదన్నారు. అవి చాలా విస్తృతమైనవని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై భాజపా సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. అందులో కొత్తేమీ లేదని, పార్టీ ఎప్పటి నుంచో అవే భావనలను నమ్ముతోందని తెలిపారు.