దండం.. దరఖాస్తు

4

అభివృద్ధియే ఎజెండా

గద్దర్‌ కొత్త జెండా

25శాతం మ్యానిఫేస్టో అమలుచేసినా చాలు

అభివృద్ధి కోసం జనంలోకి : గద్దర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) :

దండం.. దరఖాస్తు కార్యక్రమంతో అభివృద్ధియే ఎజెండాగా జనంలోకి వెళ్తానని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖరరావు కేవలం పథకాలు ప్రక టించకుండా తన ఆర్థిక విధానం ఏమిటో స్పష్టంచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మావోయిస్టుల అజెండా అమలుచేస్తానన్న కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న హావిూల్లో 25శాతం అమలుచేసినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. గద్దర్‌ శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య కార్యదర్శి నర్సింగరావును సచివాలయంలో కలిశారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి హల్దీవాగుపై నిర్మించిన చెరువును నింపాలని ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్‌ విూడియాతో మాట్లాడారు. మావోయిస్టుల నిషేధంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు. నిషేధంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తాను తెలంగాణవాదినని తెలిపారు. మావోయిస్టులపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలనేది మావోయిస్టులు-ప్రభుత్వం చర్చల ద్వారా తేల్చుకోవాలని అన్నారు. వందలాది కేసులున్న తెలంగాణ యువత పరిస్థితి ఏమిటని గద్దర్‌ ప్రశ్నించారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. ప్రజల పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఉద్యమాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇక అభివృద్ధిని కూడా పోరాడి సాధించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో త్వరలో అభివృద్ధి యాత్రలతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ ఎన్నికల ప్రణాళికలో 25శాతం అమలైనా విజయం సాధించినట్లేనని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.