భారీగా బోగస్‌ కార్డుల ఏరివేత

5

అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు : మంత్రి ఈటెల

నెలాఖరులోగా రుణమాఫీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణలోని బోగస్‌ రేషన్‌ కార్డులను రద్దుచేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రుణమాఫీ అమలుచేస్తామని చెప్పారు. రుణమాఫీపై ఏర్పాటుచేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ శనివారం మరోమారు సమావేశమై రుణమాఫీకి విధివిధానాల రూపకల్పనపై చర్చించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలు ప్రతిపాదనలతో నివేదిక సిద్ధంచేసినట్లు  సమాచారం. నేడో రేపో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ఆమోదం తర్వాత రుణమాఫీ అమల్లోకి రానుంది. రైతుల రుణమాఫీకి కట్టబుడి ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. రుణమాఫీకి రూ.16వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై వెనుకడుగవు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. రూ.లక్ష లోపు రుణాలను మాఫి చేస్తామన్నారు. రుణమాఫీకి సంబంధించి జిల్లాల నుంచి వివరాలు తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని, డాటా వచ్చిన వెంటనే రుణమాఫీ అమలు చేస్తామన్నారు. సెప్టెంబర్‌ నెలాఖరులోగా ఖరీఫ్‌ రుణాలు అందిస్తామని వివరించారు. భూమి లేకున్నా కొందరు నకిలీ పాస్‌బుక్‌లతో రుణాలు తీసుకున్నారని తమ విచారణలో తేలిందన్నారు. అలాంటి వాటిని ఏరివేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లక్ష వరకు రుణం మాఫీ చేసి తీరతామని స్పష్టంచేశారు. అర్హులైన వారికి రుణమాఫీ అవుతుందని చెప్పారు.అర్హులైన వారికే రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో సమగ్ర నివదిక తెప్పిస్తుందన్నారు. రైతులకు ఎలా న్యాయం జరగాలన్న దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. అర్హులైన రైతులకే లబ్ధి చేకూరాలన్నది తమ ఉద్దేశ్యమని, ప్రజల డబ్బును నిజమైన పేదలు, లబ్ధిదారులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారెవరికీ అన్యాయం జరగకుండా చూస్తుందన్నారు. నకిలీ పాస్‌బుక్‌లతో రుణాలు తీసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏది ఇచ్చినా ఉన్న వాళ్లకు, రాజకీయ నాయకులకే చేరిందని విమర్శించిన ఈటెల.. తమ ప్రభుత్వంలో మాత్రం నిజమైన పేదలుకు, రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దాదాపు 10.13 లక్షల రేషన్‌కార్డులను రద్దుచేస్తున్నట్లు తెలిపారు. అవకతకవలకు అవకాశం లేకుండా ఉండేందుకు సమగ్రంగా విధివిధానాలు రూపొందించి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.