9 నుంచి ప్రత్యేక విద్యా పక్షోత్సవాలు

శ్రీకాకుళం, జూలై 7 : ప్రత్యేక విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9 నుంచి 21వ తేదీవరకు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ ఆదేశించారు. ప్రత్యేక విద్య పక్షోత్సవాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. బాలికలు, గిరిజన ప్రమాదకర, ప్రత్యేక పరిస్థితుల్లోని పిల్లలు, వలసలు వెళ్లి వచ్చిన కుటుంబాల పిల్లలపై ప్రత్యేక దృష్టితో చర్యలు చేపట్టి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్‌ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణకు మంజూరు చేసే నిధుల్లో మరుగుదోడ్లకు వినియోగించాలని ఆదేశించారు. పక్షోత్సవాల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు సరఫరా చేయాలన్నారు. అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ రాజకుమార్‌ మాట్లాడుతూ 1629 మంది పిల్లలు ఇంకా బడి బయట ఉన్నారని తెలిపారు. వీరిని 15 రోజుల్లో పాఠశాల్లో చేర్పిస్తామని తెలిపారు. దీనికోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాజీవ్‌ విద్యామిషన్‌ పిఓ బి.నగేష్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ హరిబాబు, వయోజన విద్యాశాఖ డిడి నాగేశ్వరరావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పిడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.