దేశమే దేహం.. ధర్మమే ప్రాణం అంటూ ఉప్పల్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం
ఉప్పల్, మే 3 (జనం సాక్షి): “దేశమే దేహం.. ధర్మమే ప్రాణం” అనే నినాదంతో, “హిందువులంతా కదులుదాం – హిందూ శక్తి చాటుదాం” లక్ష్యంగా హిందూ సమ్మేళన నిర్వహణ సమితి-ఉప్పల్ ఆధ్వర్యంలో ఉప్పల్ సూర్య నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ కాలనీలకు చెందిన హిందూ బంధువులు భారీ సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖ సాధువులు, ఆధ్యాత్మిక వక్తలు హిందూ సమాజంలో ఐక్యత, చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని పేర్కొంటూ, గోరక్షణ, వేదాలు, ఉపనిషత్తులు, హిందూ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. ముఖ్యంగా నేటి యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.హిందూ సమాజం ఐక్యంగా ఉంటేనే ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తి గీతాలు, ధార్మిక సందేశాలు ఆకట్టుకున్నాయి.ఈ హిందూ సమ్మేళనంలో లక్ష్మారెడ్డి కాలనీ, సూర్య నగర్ కాలనీ, సరస్వతి నగర్, హనుమ సాయి నగర్, రాఘవేంద్ర నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.



