వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డు ఎక్కిన కామ్రేడ్లు, రైతులు
చేర్యాల (జనంసాక్షి) మే 07 : వడ్లు మొక్కజొన్నలను కొనుగోలు చేయడంలో రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రైతులతో కలిసి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ అక్కడికి చేరుకొని తహసీల్దార్ దిలీప్ నాయక్ తో మాట్లాడి త్వరితగతిన కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మక్కలు అమ్మకానికి చేర్యాల మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి 20 రోజుల నుంచి నెల వరకు రాత్రింబవళ్లు కష్టపడి ఆరబోసి ఎండబెట్టిన ధాన్యానికి గన్ని సంచులు, తాలు పట్టె మిషన్లు అందుబాటులో లేవని రైతులను గత నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ తాలు మిషన్లను ఆశ్రయించి గంటకు రూ. 1000 ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గన్ని సంచులు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మార్కెట్ లో జల్లి మిషన్లు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పరదలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులను ఇబ్బందులు పెట్టకుండా తక్షణమే కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు సుంకోజు రజిత, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, గూడెపు సుదర్శన్, తిగుళ్ల కనకయ్య, బింగి పోషయ్య, కర్రె పరమేష్, రైతులు ఉన్నారు.



