రామంతాపూర్‌లో గంజాయి పట్టివేతలు రెండు కేసుల్లో ఇద్దరు అరెస్ట్

ఉప్పల్ మే 06 ( జనం సాక్షి ): ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ-టీమ్ మరియు సిబ్బంది కలిసి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు కేసుల్లో మొత్తం సుమారు 3.459 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.రామంతాపూర్ గోకుల్ నగర్‌కు చెందిన బుచ్చిల్ల కౌశిక్ ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. సీఐలు బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ బిక్షపతి, కానిస్టేబుళ్లు రాకేష్, బాలు నాయక్, శిల్ప, డాన్, సాయి కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కౌశిక్‌ను పట్టుకుని అతని వద్ద నుంచి 2.46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలో మరో కేసులో నమెల్లి వెల్తి ప్రవీణ్ వద్ద నుంచి 1.035 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ తెలిపారు.ఈ ఘటనలతో రామంతాపూర్ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు