కార్మిక లోకానికి దిక్సూచి… తెలంగాణ ఉద్యమానికి బలమైన స్వరం…

మునీర్ భాయ్ పుస్తకావిష్కరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికులను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు మునీర్

రామకృష్ణాపూర్, జూన్ 14 (జనంసాక్షి): సామాన్య కార్మికుడి సమస్యలను సమాజం ముందుంచిన జర్నలిస్టుగా, సింగరేణి కార్మిక ఉద్యమాలకు దిక్సూచిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా మునీర్ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు మునీర్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన మునీర్ భాయ్ – ప్రొలిటేరియన్ జర్నలిస్టు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ ఎం.ఎం.రహమాన్ తో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.మంత్రి మాట్లాడుతూ మునీర్ కేవలం జర్నలిస్టు మాత్రమే కాదని, కార్మికుల కష్టాలను తన కలంతో సమాజానికి తెలియజేసిన ప్రజాపక్ష రచయిత అని అన్నారు. సింగరేణి ప్రాంతంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ, వారి హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సింగరేణి జేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన మునీర్, కార్మికులను ఉద్యమబాట పట్టించి తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. ఉద్యమ విజయానికి ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.మునీర్ వ్యక్తిత్వం, ఉద్యమ ప్రస్థానం, జర్నలిజం రంగంలో ఆయన చూపిన నిబద్ధత నేటి యువతకు ఆదర్శమని మంత్రి అన్నారు. సమాజం కోసం జీవించిన వ్యక్తుల జీవితాలను పుస్తక రూపంలో భావితరాలకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, జర్నలిస్టులు, సాహితీవేత్తలు, మునీర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మునీర్ సేవలను స్మరించుకుంటూ పలువురు వక్తలు ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. పుస్తకావిష్కరణ సభ భావోద్వేగ వాతావరణంలో సాగింది.