టోల్ నిర్వాహకుల నిర్లక్ష్యం తప్పిన భారీ ప్రమాదం!

 

 

 

 

 

 

డివైడర్ ఎక్కిన డీసీఎం తృటిలో ప్రాణాపాయం తప్పిన వాహనదారులు

వసూళ్లపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏది?

సర్వీస్ రోడ్డు లేక నిత్యం మృత్యుఘోష

మాడుగులపల్లి ఏప్రిల్ 26 (జనం సాక్షి):

మాడుగులపల్లి మండల కేంద్రంలో నామ్ ఎక్స్ప్రెస్ టోల్ ప్లాజా నిర్వాహకుల మొండివైఖరి ప్రయాణీకుల ప్రాణాల మీదకు వస్తోంది టోల్ ప్లాజాకు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న మాడుగులపల్లి గ్రామ సమీపంలో సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఆదివారం మరో ప్రమాదం చోటుచేసుకుంది వేగంగా వస్తున్న ఒక డీసీఎం వాహనం అదుపు తప్పి డివైడర్ ఎక్కగా, వెనుకనే వస్తున్న లారీ పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది
నామ్ ఎక్స్ప్రెస్ హైవేపై రాకపోకలు సాగించే వాహనాల నుండి టోల్ రూపంలో భారీగా వసూలు చేస్తున్న నిర్వాహకులు, నిబంధనల ప్రకారం నిర్మించాల్సిన సర్వీస్ రోడ్లను మాత్రం గాలికి వదిలేశారు మాడుగులపల్లి గ్రామస్తులు హైవేపైకి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది సర్వీస్ రోడ్డు లేక నేరుగా ప్రధాన రహదారిపైకి వాహనాలు వస్తుండటంతో, హైవేపై వేగంగా వచ్చే వాహనాలు వాటిని తప్పించబోయి అదుపు తప్పుతున్నాయి. నేడు జరిగిన డీసీఎం ప్రమాదమే దీనికి నిలువుటద్దం
ఈ ప్రమాదకరమైన పరిస్థితిపై గతంలో అనేకసార్లు వార్తా కథనాలు వెలువడినప్పటికీ, అటు ప్రభుత్వ అధికారులు గానీ, ఇటు నామ్ ఎక్స్ప్రెస్ యాజమాన్యం గానీ కనీసం స్పందించకపోవడం గమనార్హం అధికారులు ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక ఉన్న మర్మమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నామ్ ఎక్స్ప్రెస్ యాజమాన్యంతో మాట్లాడి, వెంటనే మాడుగులపల్లి వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలి లేనిపక్షంలో మండల ప్రజలందరినీ ఏకం చేసి టోల్ ప్లాజాను దిగ్బంధిస్తామని స్థానిక నాయకులు గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

తాజావార్తలు