నిండుకుండలా పాకాల చెరువు

వరి పంటలకు సాగునీరు కరువు..

ఖానాపురం ఏప్రిల్ 3 (జనం సాక్షి):ఖానాపురం మండలం కొత్తూరు గ్రామం తుంగబంధం ఆయకట్టు అన్నదాతలకు పాకాల సాగునీరు అందకపోవడంతో వరి పండిస్తున్న రైతులు విలవిలలాడుతున్నారు. సమీపంలోనే పాకాల సరస్సు ఉన్నప్పటికీ ఆయకట్టు రైతుల వరి పంటలకు నీరు అందకపోవడంతో వరి పండిస్తున్న అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. కొత్తూరు గ్రామ సమీపంలోని లంబాడి లచ్చమ్మ గుడి వరకు ఐబి అధికారులు, ప్రజా ప్రతినిధులు యాసంగి తైవంది ఖరారు చేసారు పాకాల చెరువులో నీళ్లు నిలువ ఉన్నప్పటికీ తుంగబంధం కాలువలో చుక్క నీళ్లు సుమారు పది రోజుల నుండి రాకపోవడంతో వేసిన వరి పంట పొట్ట దశలో నీళ్లు రాకపోవడంతో పొలాలు నెర్రలు పారి సాగునీరు అందకపోవడంతో చేతికి వచ్చిన పంట దక్కకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత ఐబీ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇట్టి విషయంపై తక్షణమే చొరవ తీసుకుని తుంగబంధం చివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని సాగునీటిని అందించాలని కోరారు . ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని సంబంధిత శాఖ అధికారులు తక్షణమే అన్నదాతల కండగా ఉండేందుకు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతు రమేష్ ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేశారు.