భూపాలపల్లిలో ఘోర ప్రమాదం..

– అక్కడికక్కడే మృతి చెందిన జిల్లా రవాణా శాఖ అధికారి..
– వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఢీకొట్టిన లారీ..
– విధుల్లో జాయిన్ అయిన 17 రోజులకే ఘటన..
– భూపాలపల్లిలో తీవ్ర విషాదం..
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆర్టీవో మృతి చెందారు. సుమారు 17 రోజుల క్రితం భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా నియామకం అయిన వెంకన్న విధుల్లో భాగంగా సోమవారం ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ లారీ స్పీడుగా వచ్చి నేరుగా ఆర్టీవోను ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు జిల్లా రవాణా శాఖ అధికారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకన్న ఆకస్మికంగా లారీ ఢీకొని మృతి చెందడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంతకుముందు భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహించిన మహమ్మద్ సంధాని ఇటీవలె జగిత్యాల జిల్లాకు బదిలీ కాగా, ఆయన స్థానంలో జగిత్యాల జిల్లాలో సేవలందించిన వెంకన్న భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకోవడం పలువురి హృదయాలను కదిలింపజేసింది. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్ కావాలనే పథకం ప్రకారం ఆర్టీవోను ఢీ కొట్టి చంపేశాడా..? లేదా లారీ అదుపుతప్పి ఢీ కొట్టిందా అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.



