భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతే శ్రీరామరక్ష

మున్సిపల్ కమిషనర్ గిరీష్
జడ్చర్ల, జులై 24 (జనంసాక్షి): భూగర్భ జలాలను పరిరక్షించడంలో, నీటి ఎద్దడిని నివారించడంలో ఇంకుడు గుంతల ఏర్పాటు అత్యంత కీలకమని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్ పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఉదయ మెమోరియల్ హైస్కూల్‌లో వర్షపు నీటి నిల్వ మరియు ఇంకుడు గుంతల ప్రాముఖ్యతపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో రోడ్లపై వృథాగా పారే ప్రతి చుక్క వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తదని స్పష్టం చేశారు. వర్షపు నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, ప్రతీ పౌరుడి సామాజిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. విద్యార్థులు ఈ అంశంపై తమ ఇళ్లలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సమాజంలో మార్పునకు నాంది పలకాలని కోరారు. నేడు నగరాలు, పట్టణాల్లో కాంక్రీట్ నిర్మాణాలు విపరీతంగా పెరగడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా బోర్లు ఎండిపోయి వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఈ సమస్యకు ఇంకుడు గుంత ఏకైక మార్గం. ఇంటి స్థల లభ్యతను బట్టి 3x3x3 అడుగుల కొలతలతో గుంత తవ్వి, అడుగున కంకర, మధ్యలో ఇటుక ముక్కలు లేదా రాళ్ళు, పైన ఇసుక పొరలను అమర్చాలి. పైకప్పు మీదుగా వచ్చే నీటిని వడపోత ద్వారా ఈ గుంతలోకి మళ్లిస్తే భూగర్భ జలాలు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరగడంతో పాటు నేల కోత నివారించబడుతుంది. ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తొలగిపోతుంది. ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ప్రజలందరూ భాగస్వామ్యులై ఈ వర్షాకాలంలోనే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు అశోక్ (ఈఈ), కృష్ణయ్య, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, పాఠశాల కరస్పాండెంట్ వీణ శివకుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



