కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇంజినీరింగ్‌ కోర్సులను నిర్వహించడంలేదు.ఇలా ఇంజినీరింగ్‌ కోర్సుల్లేని వర్సిటీకి, సాంకేతిక విద్య ప్రొఫెసర్‌ను వీసీగా నియమించడమేంటన్న అభ్యంతరాలొస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కీలకమైన జేఎన్టీయూ వైస్‌చాన్స్‌లర్‌ నియామకాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. తాజాగా 9 వర్సిటీలకు వీసీలను నియమించగా, జేఎన్టీయూకు మాత్రం వీసీని నియమించలేదు. అయితే ఈ వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ సిఫారసులను ప్రభుత్వం పక్కనపెట్టినట్టు తెలిసింది.జేఎన్టీయూతోపాటు బీఆర్‌ అంబేద్కర్‌, జేఏఎన్‌ఎఫ్‌ఏయూలకు వీసీలను నియమించాల్సి ఉంది. వీసీల ని యామకంలో సామాజిక సమతూకంలో పించిందన్న ఆరోపణలొస్తున్నాయి. ఎస్టీలో ఆదివాసీ, ఎస్సీలో మాల సామాజికవర్గాలకు చోటు కల్పించలేదు. తాజా వీసీల్లో ముగ్గురు బీసీలు, ఇద్దరు రెడ్డి, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీలకు చోటు కల్పించింది. మహిళా వర్సిటీ ఇన్‌చార్జీ వీసీగా ఎస్టీ లంబాడా, ఆర్జీయూకేటీ ఇన్‌చార్జీ వీసీగా ఎస్సీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు.