70 కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్

42.3 తులాల బంగారం, 87 తులాల వెండి, రూ.42 వేల నగదు స్వాధీనం

హయత్‌నగర్, జూలై 8 (జనం సాక్షి) పగటి పూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస గృహ చోరీలకు పాల్పడుతున్న ఓ సీరియల్ నేరస్థుడిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 42.3 తులాల బంగారు ఆభరణాలు, 87 తులాల వెండి వస్తువులు, రూ.42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మునగానూరు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న శ్రీరామ్ నరసింహ చారి, అలియాస్ నయామి, అలియాస్ రాజేష్ (39), చింతల్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన నాలుగు గృహ చోరీ కేసులతో పాటు పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.నిందితుడు గతం లోనూ తెలంగాణ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 70కుపైగా గృహ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనేకసార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.ఇటీవల మునగానూరు, ద్వారక వెంకటసాయి నగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించినట్లు విచారణలో తేలింది. దొంగిలించిన ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించి వచ్చిన నగదును ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఖర్చు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును బాధితులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నిందితుడిపై నమోదైన ఇతర కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి, దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. శంకరయ్య, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి. సంతోష్ కుమార్, వనస్థలిపురం ఏసీపీ పి. కాశిరెడ్డి, క్రైమ్ స్టాఫ్ సిబ్బందిని ఎల్‌బీ నగర్ జోన్ డీసీపీ బి. అనూరాధ అభినందించారు.

తాజావార్తలు