అసెంబ్లీలో చర్చించాకే ఘోష్‌ నివేదికపై చర్యలు

`శాసనససభలో చర్చించాకే ముందుకు వెళతాం
` హైకోర్టుకు వివరించి ప్రభుత్వం
` నివేదికను వెబ్‌సైట్‌ నుంచి తొలగించండి
` కమిషన్‌పై స్టేకు నిరాకరణ
` విచారణ నాలుగు వారాలకు వాయిదా
` హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌లకు చుక్కెదురు
హైదరాబాద్‌,ఆగస్ట్‌22(జనంసాక్షి): మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్‌, హరీష్‌రావు ఎమ్మెల్యేలు కాబట్టి.. అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వంపై కూడా హైకోర్టు సీరియస్‌ అయింది. ముందస్తుగా విూడియా సమావేశం నిర్వహించి.. 60 పేజీల రిపోర్ట్‌ బయట పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అన్ని పబ్లిక్‌ డొమైన్‌ నుంచి వెంటనే రిపోర్ట్‌ తొలగించాలని ఆదేశించింది. కమిషన్‌ 8ఇ, 8ఈ నోటీసులు ఇవ్వకుండా.. పిటీషనర్లపై ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని అభిప్రాయ పడిరది. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్‌ ప్రభుత్వం కమిషన్‌ వేసిందని కేసీఆర్‌, హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. అందులో భాగంగా శుక్రవారం కేసీఆర్‌, హరీష్‌రావు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్న హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక.. పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి ఉంటే.. దానిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే పిటిషనర్లు కోరిన విధంగా స్టే మాత్రం ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో నిరాశ ఎదురైనట్లు అయింది. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ శుక్రవారం తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అందిన నివేదకను అసెంబ్లీలో ప్రవేశ పెడతామని కోర్టుకు స్పష్టం చేశారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంటే.. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు ఏజీ వివరించారు. అంతలో హరీష్‌ రావు తరఫు న్యాయవాది సుందరం తన వాదనలు వినిపిస్తూ.. మొత్తం కమిషన్‌ నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో తమ వారిపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని కోరుతున్నామని కోర్టు దృష్టికి న్యాయవాది సుందరం తీసుకు వెళ్లారు. అంతేకాకుండా.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికను అసెంబ్లీలో కంటే.. ముందే విూడియాకు ఇచ్చి.. తమ పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని కోర్టుకు న్యాయవాది సుందరం తెలిపారు. ఆ క్రమంలో ఈ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటు-ందని కోర్టుకు ఏజీ వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పగుళ్లు ఏర్పాడ్డాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. దాదాపు 13 నెలల పాటు వందలాది మందిని విచారించింది. అలాగే మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌ రావు, ఈటల రాజేందర్‌లను సైతం విచారించి.. కమిషన్‌ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కర్మ, కర్త, క్రియా అంతా కేసీఆర్‌ అంటూ ఈ విచారణలో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేసీఆర్‌, హరీష్‌ రావులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.