స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలి
జడ్చర్ల, ఆగస్టు 8 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న వర్షపు నీటి కాల్వ పనులు, జాతీయ రహదారి పనులు, కల్వర్టు పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వర్షపు నీటి కాల్వ పనులు, జాతీయ రహదారి పనులు, కల్వర్టు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతను ఆయన పరిశీలించి సమీక్షించారు. సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు పనులను వేగవంతం చేసి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని సంబంధిత శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని, ముఖ్యంగా పనులు జరుగుతున్న సమయంలో సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేదా సమస్యలు కలగకుండా ఉండేందుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



