గల్ఫ్ ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు మరో కోటి రూపాయలు విడుదల 

వేములవాడ (జనంసాక్షి) : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం అదనంగా ఒక కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ.85 లక్షలు ఆర్థిక సహాయం మంజూరి పత్రాలను అందజేసిన నేపథ్యంలో నిధుల కొరత లేకుండా అదనంగా మరో కోటి రూపాయలు విడుదల చేశారు. గత నెలలో విడుదల చేసిన రూ.6 కోట్ల 45 లక్షలకు ఇది అదనం.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నేనున్నానని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి భరోసాగా నిలిచారని,  గల్ఫ్ బాధితులకు కాంగ్రేస్ అభయహస్తం అందిస్తున్నదని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.25 లక్షలు, కామారెడ్డి కి రూ.20 లక్షలు, జగిత్యాల కు రూ.15 లక్షలు, నిజామాబాద్, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాలకు రూ.10 లక్షల చొప్పున, హైదరాబాద్, నల్గొండ జిల్లాకు రూ.5 లక్షల చొప్పున మొత్తం ఒక కోటి రూపాయలు గల్ఫ్ ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం ప్రభుత్వం అదనంగా కేటాయించింది.