చిన్న వాల్గొట్‌లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

సిరికొండ, జూలై 11 (జనం సాక్షి): జులై 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా శనివారం చిన్న వాల్గొట్ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ చేపట్టి నులిపురుగుల నివారణ, ఆల్బెండాజోల్ మాత్రల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏ యన్ యం స్వప్న మాట్లాడుతూ 1 నుండి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అర (½) మాత్ర, 2 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక పూర్తి ఆల్బెండాజోల్ మాత్ర ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామంలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. “మెరుగైన ఆరోగ్యం – మెరుగైన చదువు – బలమైన భవిష్యత్తు” లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవడం వల్ల నులిపురుగులు నివారించబడటంతో పాటు పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి సక్రమంగా అందడం, ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ఏకాగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. అలాగే నులిపురుగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శరణ్య, జూనియర్ అసిస్టెంట్ సుమలత, ఏఎన్‌ఎం స్వప్న, ఆశ కార్యకర్త సుజాత, అంగన్‌వాడీ టీచర్లు ఉమారాణి, విజయలత, రాంబాయి, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు.



