మోదీ సభ విజయవంతానికి రామంతాపూర్‌లో బీజేపీ విస్తృత ప్రచారం

ఉప్పల్, మే 8 (జనం సాక్షి):మే 10, 2026న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రామంతాపూర్ ఏరియాలో బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు వంగాల సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో “దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం” అనే నినాదంతో చిన్న చెరువు పరిసరాలు, పలు కాలనీలు, పార్కులు మరియు ప్రధాన రహదారుల వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ సభకు ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందంటున్న బీజేపీ నాయకులు:ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు వస్తున్న తొలి పర్యటన కావడంతో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొంటున్నారు.

₹8,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు:సభ సందర్భంగా సుమారు ₹8,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారని నాయకులు వెల్లడిస్తున్నారు. కేంద్ర నిధులతో తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు దోహదపడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. అభివృద్ధి రాజకీయాల ద్వారానే దేశం ముందుకు సాగుతుందని, మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచస్థాయిలో మరింత బలపడుతోందని అభిప్రాయపడుతున్నారు.

భారీగా తరలిరావాలని విజ్ఞప్తి:ఈ భారీ బహిరంగ సభకు యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. దేశాభివృద్ధి కోసం మోదీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక శక్తిగా ఎదుగుతుందని, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పలువురు నాయకుల పాల్గొనిక :ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తాళ్ల బాలకృష్ణ గౌడ్, వెంపటి శ్రీనివాస్, కొంపల్లి ఉపేందర్, మామిళ్ళ నందకిషోర్ యాదవ్, శాగా రవి, దర్శనాల సుధాకర్, ఉపేందర్ యాదవ్, వేముల వెంకట్ రెడ్డి, బొడ్డుపల్లి లింగం తదితరులు పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నారు.

తాజావార్తలు