మృత్యుపాశంగా మారుతున్న విద్యుత్ తీగలు ఇందుగులలో కాంట్రాక్టర్ బరితెగింపు!

ట్రాన్స్‌ఫార్మర్ నుండి నేరుగా భారీ యంత్రాలకు కనెక్షన్లు
నిబంధనలు తుంగలో.. ప్రాణాలను పణంగా పెడుతున్న వైనం
విద్యుత్ శాఖ అధికారుల మామూలు మౌనంపై విమర్శలు
మాడుగులపల్లి, మే 8( జనం సాక్షి)ప్రభుత్వ నిబంధనలు గాలికి సామాన్యుల ప్రాణాలు ఫణంగా ఇదే ఇప్పుడు మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో కనిపిస్తున్న దారుణ పరిస్థితి ఒకవైపు విద్యుత్ ప్రమాదాలపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు ఓ కాంట్రాక్టర్ లాభార్జనే ధ్యేయంగా అత్యంత ప్రమాదకర రీతిలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు ట్రాన్స్‌ఫార్మర్ నుండి నేరుగా వైర్లు తగిలించి భారీ యంత్రాలను నడుపుతున్న వైనం చూస్తుంటే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు
పారిశ్రామిక లేదా నిర్మాణ అవసరాల కోసం విద్యుత్ వాడాలంటే సదరు కాంట్రాక్టర్ ప్రత్యేక అనుమతులు తీసుకుని, తాత్కాలిక మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇందుగులలో ఆ పరిస్థితి లేదు ఏకంగా గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ వద్దే నగ్నంగా ఉన్న వైర్లను నేరుగా (Direct Hooking) తగిలించి మిషన్లను రన్ చేస్తున్నారు కనీస రక్షణ కవచాలు లేని ఆ తీగలు ఏ క్షణమైనా తెగిపడేలా ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందిసాధారణంగా హై-వోల్టేజ్ వైర్ల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలి అయితే, కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన ఈ అక్రమ కనెక్షన్ల వల్ల లోడ్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయే ప్రమాదం ఉంది అంతేకాకుండా, భారీ యంత్రాలు విద్యుత్తును ఎక్కువగా లాగడం వల్ల గ్రామంలో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి వర్షం పడిన సమయంలో లేదా గాలి వీచినప్పుడు ఈ బహిరంగ విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు
కళ్ళ ముందే ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ దొంగతనం జరుగుతున్నా, లైన్ మెన్ నుంచి పై అధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడం వెనుక పెద్ద మతలబు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి అక్రమాలను అరికట్టాల్సిన విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరగకముందే అక్రమ కనెక్షన్లను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



