స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం.
నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.స్వీయ జనగణన పై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం ముఖ్య ప్రణాళిక అధికారి, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన జనగణన నడకను జిల్లా కలెక్టర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలు ఎన్ జి కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జనగణంలో భాగంగా ముందుగా స్వీయ గణన ,గృహాల లెక్కింపు , జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 26 నుండి ప్రారంభమైన స్వీయ గణన ఈనెల 10 తో ముగుస్తుందని, జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొనాలని వారి వివరాలన్నింటిని ఇవ్వాలని కోరారు. ఇంటిలో నుండే స్వీయ గణన చేసుకోవచ్చని, 16 భాషల్లోగణన చేసుకునేందుకు అవకాశం ఉందని,మొబైల్ లొనే స్వీయ గణన చేసుకోవచ్చని,ఇది చాలా సులభమని తెలిపారు. ఈ నెల 11 నుండి ఎన్యుమరేటర్లు ఇల్లిల్లు తిరిగి హౌస్ లిస్టింగ్ చేస్తారని చెప్పారు. దేశ ప్రణాళిక, భవిష్యత్తు అభివృద్ధి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు జనగణన ఉపయోగపడుతుందని అన్నారు.అనంతరం పట్టణంలోని పెద్ద బండ వద్ద స్వీయ గణన పై ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ స్వీయ గణన సందర్బంగా అద్దె ఇంట్లో ఉన్న అక్కడి నుండే వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జన గణ మన సందర్భంగా సరైన సమాచారం ఇవ్వాలని,ఇది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు .జనగణన జనాభా లెక్కలకు తప్ప ఇతర దేనికి ఉపయోగించడం జరగదని,అందువల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.ఇంట్లో ఉన్న వారందరి వివరాలను తెలియజేయాలని, కుటుంబానికి ఒక ఎన్యుమరేషన్ ఐడి వస్తుందని ,దీని ఆధారంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు జనగణన జాప్యం లేకుండా త్వరత్వరగా చేసుకునేందుకు వీలవుతుందన్నారు .జిల్లాలో 20 లక్షల మంది జనాభా ఉండగా, 5,50,000 ఇండ్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 12000 కుటుంబాలు స్వీయగణన చేసుకోవడం జరిగిందని ,తక్కిన వారందరూ కూడా స్వీయ గణనలో భాగస్వాములు కావాలని పునరుద్ఘాటించారు.నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వీయ గణన పై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం” జనగణన వాక్” నిర్వహించడం జరిగిందని, అభివృద్ధికి జనాభా ఎంతో ముఖ్యమని అన్నారు.ప్రజలు ఇంటి నుండే సెల్ ఫోన్ లో స్వీయ గణన చేసుకోవచ్చని, ఇందుకు కేవలం 10 పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని ,స్వీయ గణనకు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, సిపిఓ శ్రీనివాస్ నాయక్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, జిల్లా క్రీడలు యువజన సర్వీసుల అధికారి అక్బర్ అలీ, తహసిల్దార్ పరశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



