స్వాతంత్ర్య స్ఫూర్తితో భూపాలపల్లిలో బీజేపీ యాత్ర

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కీర్తిరెడ్డి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 100 అడుగుల అతిపెద్ద జాతీయ జెండాను చేతుల్లో పట్టుకుని ర్యాలీ మార్గమంతా ‘భారత్ మాతా కి జై’, ‘వందేమాతరం’, ‘జై హింద్’ దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఎంఎస్ కార్యాలయం ముందు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, ఇది కేవలం కార్యక్రమం కాదు, జాతీయ ఐక్యతకు చిహ్నమని చెప్పారు. భూపాలపల్లి జిల్లా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు చూపిన ఉత్సాహం అభినందనీయం. మనమందరం దేశ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది అని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించడంతో పాటు, ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. మనమంతా భారతీయులమనే భావనతో దేశంపై విశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు. జాతీయ జెండా కింద ప్రజలంతా ఐక్యంగా ఉంటే దేశాన్ని ఏ శక్తీ ఓడించలేదన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.ర్యాలీ ముగింపులో అంబేద్కర్ సెంటర్ వద్ద అందరూ ఏకంగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, కౌన్సిలర్ కన్నం యుగేందర్, రాష్ట్ర నాయకులు ఎరుకల గణపతి, జిల్లా నాయకులు దొంగల రాజేందర్, రాకేష్ రెడ్డి, మునిందర్ తదితరులు పాల్గొన్నారు.



