ఉప్పల్ స్టేడియంలో చీకట్లు.. అరగంట ఆగిన టీజీ–20 ఫైనల్ మ్యాచ్!

నిర్వహణ లోపంపై అభిమానుల ఆగ్రహం..

ఫ్లడ్‌లైట్లు నిలిచిపోవడంతో ఆటకు అంతరాయం

ఉప్పల్, జూలై 12 ( జనం సాక్షి ) : ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీజీ–20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తీవ్ర నిర్వహణ లోపం వెలుగుచూసింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ అకస్మాత్తుగా ఫ్లడ్‌లైట్లు నిలిచిపోవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.దాదాపు అరగంటపాటు ఫ్లడ్‌లైట్లు పనిచేయకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మైదానం మొత్తం చీకటిలో మునిగిపోవడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లగా, వేలాది మంది ప్రేక్షకులు తమ స్థానాల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది.ఇంత ప్రతిష్ఠాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న స్టేడియంలో విద్యుత్, ఫ్లడ్‌లైట్ల నిర్వహణలో లోపాలు తలెత్తడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శించారు. సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించిన అనంతరం ఫ్లడ్‌లైట్లు తిరిగి వెలగడంతో మ్యాచ్ పునఃప్రారంభమైంది. అయితే ఈ ఘటనతో ప్రేక్షకులకు తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు మ్యాచ్ ఉత్కంఠకు కూడా అంతరాయం ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్టేడియంలోని విద్యుత్ వ్యవస్థ, ఫ్లడ్‌లైట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

 

తాజావార్తలు