నల్లగొండలో దారుణ హత్య..
ఉదయమే ఉలిక్కిపడ్డ నల్లగొండ నగరం
నల్లగొండ ప్రతినిధి, జూన్ 9,(జనం సాక్షి): నల్లగొండ పట్టణంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. గొల్లగూడా పెద్దబండ ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయి అనే యువకుడు హత్యకు గురయ్యాడు.హ్యాపీ హోమ్స్ ఎదురుగా ఉన్న ఓ వెంచర్‌లో సాయి మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దాడి తీవ్రతకు మెదడు బయటకు వచ్చేంతగా గాయాలు చేసినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే టూ టౌన్ సీఐ,శాలి గౌరారం ఇంచార్జి సిఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్ఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాల సేకరణ చేపట్టారు.సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా శాలి గౌరారం ఇంచార్జి సీఐ రాఘవ రావు,తిప్పర్తి ఎస్ఐ శంకర్ మాట్లాడుతూ హత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని వెల్లడించారు.హత్యకు గల కారణాలు ఏమిటి? వ్యక్తిగత విభేదాలా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.



