జంగిలోడి తండాలో పశువుల కొట్టం దగ్ధం.. ఎద్దు మృతి

సిరికొండ, ఆగస్టు 7 (జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జంగిలోడి తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో భూక్య రాములకు చెందిన పశువుల కొట్టం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవగా, మరో ఎద్దు బయటకు తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. పశువుల కొట్టం పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే కొట్టం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో పశువుల కొట్టంతో పాటు అందులో ఉన్న సామగ్రి కూడా కాలిపోయినట్లు సమాచారం. ఇటీవల అటవీ శాఖ అధికారులు ఆక్రమిత అటవీ భూముల చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అధికారులకు సమాచారం ఇచ్చారనే అనుమానంతో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పశువుల కొట్టానికి నిప్పుపెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో సహజసిద్ధంగా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉందని వారు చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి, జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని గ్రామస్థులు కోరుతున్నారు.



