ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది వికృతానందం

* 32 ఏళ్ల క్రితం కన్ను పోతే.. ఇప్పుడు రాజకీయం చేస్తారా?
* ముగ్గురు మంత్రులు.. ఆరు కళ్లతో సాధించిందేమిటి?
* నా అభివృద్ధిలో పదో వంతైనా ఖమ్మంలో చేశారా?
* హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ఏ ‘అంగవైకల్యం’ అడ్డొచ్చింది?
* జడ్పీటీసీ స్థాయి దాటని సీఎం మాటలు.. ఇకనైనా మారండి
* బీజేపీతో టచ్‌లో ఉన్నది రేవంత్, కాంగ్రెస్ మంత్రులే..
* జగన్నాధపురం సభలో సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం బ్యూరో, (జనంసాక్షి):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శారీరక లోపాలను ఎత్తిచూపుతూ వికృతానందం పొందుతున్నారని, ‘బాడీ షేమింగ్’ చేయడం ఆయనకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న జగన్నాధపురం సభలో తనను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై పువ్వాడ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
* ఒక్క కన్నున్నా ఒరగబెట్టా.. మీ ఆరు కళ్లతో ఏం చేశారు?
“32 ఏళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నా కన్ను పోయింది. ఈ విషయాన్ని నేనెప్పుడూ దాచలేదు, రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ ముందే చెప్పా. గతంలోనూ నాపై ఇలాంటి చౌకబారు విమర్శలే చేశారు. నాకు ఒక్క కన్ను ఉన్నా.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించా. మరి ఇప్పుడు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.. ఆరు కళ్లతో చూస్తున్నారు కదా! నా హయాంలో జరిగిన అభివృద్ధిలో కనీసం పదో వంతైనా ఈ రెండున్నర ఏళ్లలో చేశారా?” అని పువ్వాడ సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలతో తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.
* మీకు ఏ ‘వైకల్యం’ అడ్డొచ్చింది?
పూర్తి ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఎందుకు పూర్తి చేయలేదని పువ్వాడ నిలదీశారు. ఆరు గ్యారంటీలు, రైతు భరోసా హామీలు నెరవేర్చకపోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంగవైకల్యం అడ్డొచ్చింది? అని ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంతలా స్థాయి దిగజార్చుకుని మాట్లాడటం రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఇప్పటికీ జడ్పీటీసీ స్థాయి నాయకుడిలాగే మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. ఇకనైనా మారి, ముఖ్యమంత్రిలా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.
* సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ సృష్టే..
ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి తానే సీతారామ ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చానని డబ్బా కొట్టుకుంటున్నారని పువ్వాడ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు కోసం రూ.9,000 కోట్లు ఖర్చు చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కేవలం వంద కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టును 30 సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించానని చెప్పారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ మాటలు కోటలు దాటుతున్నాయని.. మహారాష్ట్ర నుండి అనుమతులు తెచ్చారా? రెండున్నరేళ్లలో పూర్తి చేస్తారా? అని సవాల్ విసిరారు. కన్నెపల్లి పంపుహౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే భద్రాచలం మునుగుతుందని సీఎం అనడం హాస్యాస్పదమని.. కాళేశ్వరం గొప్పతనాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
* అందాల పోటీలు.. క్రికెట్ మ్యాచ్‌లు కావాలా?
పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం చేతగాని ఈ ప్రభుత్వం.. ప్రచారం కోసం అందాల పోటీలు, క్రికెట్ పోటీలు పెడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయని, దానిని ఎలా అధిగమించాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నిన్న ఖమ్మం జిల్లాలో సర్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.
* బీజేపీతో టచ్‌లో ఉన్నది మీరే.. ఆ ఈడీ రైడ్స్ ఏమయ్యాయి?
బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని అబద్ధాలు చెప్తున్నారని.. నిజానికి సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులే ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రిపై ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత ఆ సమాచారం ఎందుకు బయటకు రావడం లేదని, లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించారు. “నాపై ఉన్న కక్షను ఈ విధంగా పర్సనల్ గా తీర్చుకుంటున్నారు. దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ కక్షసాధింపులు పక్కన పెట్టి ప్రజలకు మంచి చేయడం నేర్చుకోండి. తెలంగాణలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే ప్రజలకు స్వర్ణయుగం” అని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.



